నెల్లూరు(క్రైమ్): నగరంలోని అభిరామ్ హోటల్ సమీపంలో శుక్రవారం అనారోగ్యమో? వడదెబ్బ వల్లనో స్పష్టమైన కారణాలు తెలియదు గానీ గుర్తుతెలియని వ్యక్తి(35) మృతిచెందాడు. ఈ విషయమై స్థానికులు చిన్నబజారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతుని వివరాలు తెలిసిన వారు చిన్నబజారు పోలీసులను సంప్రదించాలని కోరారు.
పెయింట్స్ గోదాములో అగ్నిప్రమాదం
నెల్లూరు(క్రైమ్): పెయింట్స్ గోదాములో అగ్నిప్రమాదం సంభవించి రూ.లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లిన ఘటన ప్రశాంతినగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది సమాచారం మేరకు.. నగరానికి చెందిన కె.జనార్దన్‌రెడ్డి ప్రశాంతినగర్‌లో పెయింట్స్ గోదాము నిర్వహిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
ఇద్దరు టీఏల సస్పెన్షన్
వాకాడు: మండలంలో 19 పంచాయతీలకు సంబంధించి ఏడాది కాలంలో జరిగిన గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై శుక్రవారం వాకాడులో సామాజిక తనిఖీలు నిర్వహించారు. పీడీ ఎంసీ మద్దిలేటి పంచాయతీల వారీగా పనులను తనిఖీ చేశారు. పీడీ మాట్లాడుతూ మండలంలో 227 పనులకు రూ.8.27 కోట్లు ఖర్చు చేయగా, అవకతవకలకు పాల్పడిన ఇద్దరు టీఏలు రమేష్, మల్లికార్జున్ నుంచి రూ.77 వేలు రికవరీకి ఆదేశించారు. ఈ మేరకు వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలని ఎంపీడీఓ సాయిప్రసాద్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ విజయమ్మ, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
చోరీ కేసుల్లో నలుగురి అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): చోరీలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న నలుగురు దొంగలను వేదాయపాళెం పోలీసులు అరెస్ట్ చేశారు. వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు శుక్రవారం వివరాలను వెల్లడించారు. నెల్లూరు రూరల్ మండలం కావేరినగర్‌లోని ఓ దుకాణంలో ఇటీవల గృహోపకరణాలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుని వెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సై అంకమ్మ తన సిబ్బందితో దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతికత ఆధారంగా నిందితులు వైఎస్సార్ నగర్ పుట్టవీధికి చెందిన పాతనేరస్తుడు చిన్నబ్బయ్య, శివాజీ నగర్‌కు చెందిన సాయి, శ్రామికనగర్‌కు చెందిన సుప్రజ, పోలమ్మలుగా గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం సాయంత్రం నిందితులను వల్లూరమ్మ కాలనీ వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని విచారించగా గృహోపకరణాలతో పాటు దర్గామిట్ట, బాలాజీనగర్ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.50 వేలు విలువ చేసే రెండు టీవీఎస్ ఎక్స్‌ఎల్ మోటారు సైకిళ్లు, గృహోపకరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ చెప్పారు. చెడు వ్యసనాలకు బానిసైన నిందితులు చోరీలకు పాల్పడుతన్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
కండలేరులో నీటి నిల్వ
రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 41.750 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1050, లోలెవల్ కాలువకు 50, లెవల్ కాలువకు 80, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 65 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు.


