చిల్లకూరు: ఉపాధి కోసం వచ్చిన ఇద్దరు యువకుల మధ్య నగదు విషయంలో నెలకొన్న వివాదం హత్యకు దారితీసిందని గూడూరు రూరల్ సీఐ కిశోర్‌బాబు తెలిపారు. చెన్నూరులో ఈనెల 7న జరిగిన హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ మేరకు శుక్రవారం గూడూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు వివరాలను సీఐ కిశోర్‌బాబు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ నగర్ జిల్లా, జజ్మా ప్రాంతానికి చెందిన మహ్మద్ షెహన్షా, మహ్మద్ సమ్మీ గూడూరు మండలంలోని ఓ రేకుల పరిశ్రమలో చేరేందుకు వచ్చారు. వీరు ఇక్కడికి వస్తుండగా రైలులో పరిచయం ఏర్పడడంతో ఇరువురు చెన్నూరులో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య నగదు విషయంలో వివాదం నెలకొనడంతో మహ్మద్ షెహన్షా ఇటుక రాయి తీసుకుని మహ్మద్‌సమ్మీపై దాడి చేసేందుకు యత్నించాడు. దీంతో సమ్మీ వంట గదిలో ఉన్న చాకు తీసుకుని పలుమార్లు మహ్మద్ షెహన్షాను పొడవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో నిందితుడు తన ఆధారాలు ఏమీ లేకుండా బెంగళూరుకు వెళ్లి అక్కడి నుంచి కాన్పూరుకు వెళ్లాడు. కాగా హత్యకు సంబంధించి పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపడుతున్న విషయం తెలుసుకున్న నిందితుడు తనను పనికి పిలిపించిన కాంట్రాక్టర్‌తో కలిసి నేరుగా రూరల్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ కేసును ఛేదించడంలో ఎస్సైలు తిరుపతయ్య, సురేష్‌బాబు, వెంకటేశ్వరరెడ్డితో పాటుగా హెడ్‌కానిస్టేబుల్ మహ్మద్, శ్రీనివాసరావు, కానిస్టేబుల్స్ కె.శ్రీనివాసరావు, వి.శ్రీనివాసులు, నాగరాజు, విష్ణు తదితరలు చొరవ చూపగా, వారిని ఎస్పీ అజిత అభినందనలు తెలిపారు. సమావేశంలో గూడూరు ఒకటో పట్టణ సీఐ శేఖర్‌బాబు పాల్గొన్నారు.


