నెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థలో పన్నుల రూపంలో ముక్కుపిండి వసూలు చేసిన ప్రజాధనాన్ని వివిధ రకాల పేర్లతో ప్రైవేటు కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని సీఐటీయూ నాయకులు కత్తి శ్రీనివాసులు, పెంచలయ్య అన్నారు. చెత్త తరలించే వాహనాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం పాతమున్సిపల్ కార్యాలయ సమీపంలోని వెహికల్ షెడ్డు వద్ద డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరపాలక సంస్థ ద్వారానే వాహనాలు కొనసాగించాలని, ప్రైవేటీకరణ చర్యలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నెలకు ఒకటిన్నర కోటికి పైగా ప్రైవేటు ట్రాక్టర్ల పేరుతో ప్రజా సొమ్మును వృథా చేస్తున్నారన్నారు. ఇప్పుడు మరలా 200 ఈవీ వాహనాలను ప్రైవేటు కాంట్రాక్టర్ ద్వారా తీసుకురావడం వల్ల నెలకు రూ.2 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు. వివిధ సంఘాల నాయకులు వజ్రమ్మ, సునీల్, సుధాకర్, సీహెచ్ మనోజ్‌కుమార్, ఎం.అశోక్, మట్టిపాటి శ్రీనివాసులు, లోకేష్, పందల శ్రీనివాసులు నాగేశ్వరరావు, శివ, షఫీ తదితరులు పాల్గొన్నారు.


