● గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
నెల్లూరు సిటీ: రూరల్ పరిధిలోని పెన్నానదిలో ఓ యువకుడు ఈతకెళ్లి గల్లంతైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురానికి చెందిన చంద్రశేఖర్(27) నాలుగేళ్ల క్రితం ఇంజినీరింగ్ పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం తన స్నేహితులైన నవీన్, సతీష్‌లతో కలిసి జొన్నవాడకు వెళ్లారు. సమీపంలోని పెన్నానదిలో ఈత కొడుదామని ముగ్గురు స్నేహితులు నది వద్దకు చేరుకున్నారు. చంద్రశేఖర్‌కు ఈతరాకపోవడంతో చాలాసేపు ఒడ్డునే ఉన్నారు. స్నేహితులు ఈతకొట్టడాన్ని చూసి చంద్రశేఖర్ నాలుగు అడుగులు ముందుకు వేశారు. ప్రమాదవశాత్తు నీటిలో మునగడంతో స్నేహితులు కాపాడే ప్రయత్నం చేశారు. కొంతసేపటికి చంద్రశేఖర్ ఆచూకీ కనిపించలేదు. దీంతో స్థానికుల సహాయంతో నదిలో గాలించినా ఫలితం లేకపోవడంతో రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై రూరల్ ఎస్సై సుధీర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పొదలకూరు నిమ్మధరలు(కిలో)
పెద్దవి: రూ.100
సన్నవి: రూ.40
పండ్లు: రూ.20


