కారుణ్య నియామకపత్రాల అందజేత | - | Sakshi
Sakshi News home page

కారుణ్య నియామకపత్రాల అందజేత

May 16 2026 12:39 AM | Updated on May 16 2026 12:39 AM

నెల్లూరురూరల్‌: కారుణ్య నియామకం ద్వారా ఇద్దరికి ఉద్యోగావకాశాలు కల్పిస్తూ కలెక్టర్‌ హిమాన్షు శుక్లా శుక్రవారం నియామక ఉత్తర్వులను అందించారు. వైద్యారోగ్య శాఖలో ఏఎన్‌ఎం గ్రేడ్‌–3గా పనిచేస్తూ మృతి చెందిన సులోచనమ్మ కుమారుడు అఖిల్‌కు సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌లో వెల్ఫేర్‌, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌గా, వీఆర్వో గ్రేడ్‌–1గా రెవెన్యూ శాఖలో పనిచేస్తూ మృతి చెందిన నాగేశ్వరావు కుమార్తె శోభకు ఏపీజీఎల్‌ఐ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా నియామక ఉత్తర్వులు అందించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయకుమార్‌, కలెక్టరేట్‌ ఏఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.

జిల్లాలో 142 విద్యా సంస్థల

బస్సులకు నోటీసులు

నెల్లూరు (టౌన్‌): జిల్లాలో ఫిట్‌నెస్‌ గడువు ముగిసిన విద్యాసంస్థల బస్సులను జిల్లా రవాణాశాఖ అధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 436 విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేసినట్లు ఆర్టీఓ మదాని తెలిపారు. ఈ బస్సుల్లో కండీషన్‌ లేని 142 బస్సులకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. మోటారు వెహికల్‌ చట్టం 185 ప్రకారం బస్సులన్ని కండీషన్‌లో ఉంచుకుని ఫిట్‌నెస్‌ చేయించుకోవాలన్నారు. ఫిట్‌నెస్‌ చేయించని బస్సులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మట్టి మాఫియా ట్రాక్టర్‌

డ్రైవర్‌ దుర్మరణం

సంగం: మట్టిని అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ అదుపు తప్పిన ప్రమాదంలో డ్రైవర్‌ దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన మండలంలోని మర్రిపాడులో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నేతలు మట్టి మాఫియాగా ఏర్పడి గ్రామంలోని ట్రాక్టర్ల ద్వారా మట్టిని కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలో బుచ్చిరెడ్డిపాళెం మండలం చెల్లాయపాళేనికి చెందిన ఆర్‌.హరికిరణ్‌ (45) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా వెళ్లి మట్టిని తరలిస్తుండగా ట్రాక్టర్‌ అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లడంతో బోల్తా పడింది. హరికిరణ్‌ ట్రాక్టర్‌ కింద పడి మృత్యువాత పడ్డాడు. సమాచారం అందుకున్న సంగం పోలీసులు హరికిరణ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement