మంత్రి ‘ఆనం’పై పల్లాకు ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

మంత్రి ‘ఆనం’పై పల్లాకు ఫిర్యాదు

May 16 2026 12:39 AM | Updated on May 16 2026 12:39 AM

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ సీనియర్లను అగౌరపరుస్తూ నమ్ముకున్న పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు కొమ్మి లక్ష్మయ్యనాయుడు, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్‌ నాయకుడు గూటూరు కన్నబాబు శుక్రవారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసి ఫిర్యాదు చేశారు. మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కొడవలూరు కిసాన్‌ సెజ్‌కు వచ్చిన పల్లా శ్రీనివాసరావును ఆ ముగ్గురు నేతలు కలిసి ఆనం తీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇద్దరు దుష్ట శక్తులను పక్కన పెట్టుకొని నియోజకవర్గంలో సహజ వనరుల దోపిడీ చేస్తున్నారని, ఇసుక, గ్రావెల్‌ దోచుకుంటున్నారని, భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడని పలు ఆధారాలతో వివరించారు. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని, గత ప్రభుత్వంలో అధికారం అనుభవించిన నాయకులను వెంటబెట్టుకొని వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ వాపోయారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న తమ వంటి సీనియర్లకు కనీస గౌరవ మర్యాద కూడా ఇవ్వడం లేదని, పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం లేదని వాపోయారు.

తాడో పేడో తేల్చుకుంటాం

మా బాధ, ఆవేదనను అర్థం చేసుకొని మాకు గుర్తింపు ఇవ్వకుంటే తాము తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వారు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇప్పటికే నియోజకవర్గంలో పూచిక పుల్లలా తీసేశారని, ఎన్నికల సమయంలో మా ఇళ్ల చుట్టూ తిరిగిన నేతలు, ఇప్పుడు మమ్మల్ని చూసే నవ్వుకునే పరిస్థితి వచ్చిందని, ఇంకా ఈ అవమానాలు తాము భరించలేమని, అఽవసరమైతే అధిష్టానం వద్ద తాడోపేడో తేల్చుకుంటామంటూ చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.

సీనియర్లమైన మాకు కనీస గౌరవం ఇవ్వడం లేదు

ఏ కార్యక్రమానికి ఆహ్వానించడం లేదు

ఆయన నియోజకవర్గంలో సహజ వనరులు దోపిడీ చేస్తున్నారు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాకు మాజీ ఎమ్మెల్యేలు కొమ్మి, చంద్రశేఖర్‌రెడ్డి, గూటూరు ఫిర్యాదు

Advertisement
 
Advertisement
Advertisement