అమ్మవారి రథోత్సవం
● జొన్నవాడలో అంగరంగ వైభవంగా
కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవం
● భక్తజన సందోహంతో కిటకిటలాడిన ఆలయ పరిసరాలు
బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని జొన్నవాడలో కొలువుదీరిన మల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం రథోత్సవ ఘట్టం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారు జాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసి పోయింది. ప్రత్యేక పూజలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను అలంకరించిన మహారథంపై ప్రతిష్టించి పురవీధుల్లో ఊరేగించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు మండలంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. జై కామాక్షితాయి, హరహర మహాదేవ నామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగిపోయాయి. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడి పడ్డారు. రథోత్సవంలో భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ పరిసరాల్లో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఎండ తీవ్రత నేపథ్యంలో ఉభయదాతలు పలుచోట్ల మజ్జిగ, తాగునీటి చలివేంద్రాలు ఏర్పాటు చేసి భక్తులకు సేవలందించారు.
నేడు ఆది దంపతుల దివ్య కల్యాణం
బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహించే స్వామి అమ్మవార్ల దివ్య కల్యాణ మహోత్సవం శనివారం జరగనుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు విస్తృ ఏర్పాట్లు చేశారు. తాగునీరు, వైద్య శిబిరాలు, పార్కింగ్, క్యూలైన్ల నిర్వహణ వంటి సౌకర్యాలు కల్పించారు.


