● న్యాయ పోరాటం చేసైనా
కోర్టుకు లాగుతాం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరురూరల్: కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టిన అధికారులను వదిలే ప్రసక్తే లేదని, న్యాయ పోరాటం చేసైనా వారిని కోర్టుకు లాగుతామని మాజీ మంత్రి, జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి అక్రమ కేసులో నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని ములా ఖత్ ద్వారా పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడారు. పెళ్లకూరు ప్రాంతంలో స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్నట్లు గుర్తించి, దానిని వీడియో తీసి అడ్డుకునేందుకు ప్రయత్నించిన కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారని తెలిపారు. ఆ తరువాత రెండో పీటీ వారెంట్ వేశారని చెప్పారు. బెయిల్‌పై వచ్చే సమయంలో మూడేళ్ల క్రితం జరిగిన ఓ పాత కేసును తవ్వి తీసి అందులో ఆయన పాత్ర ఉందని ఒక తప్పుడు కన్ఫెషన్ స్టేట్‌మెంట్ సృష్టించి మూడో పీటీ వారెంట్ వేశారని తెలిపారు. సత్యనారాయణరెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను రెండు నెలలుగా జైల్లో ఉంచి బెయిల్ రాకుండా అడ్డుకుంటూ సీడీ ఫైల్స్ సమర్పించకుండా పోలీసులు అధికారులు జాప్యం చేయడం దుర్మార్గమన్నారు. ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యకు హైకోర్టు స్టే ఆఫ్ అరెస్ట్ ఇవ్వడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసిందని గుర్తుచేశారు. కామిరెడ్డి వ్యవహారంపై ఇప్పటికే కింది కోర్టు నుంచి హైకోర్టు వరకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, న్యాయపరంగా కూటమి వేధింపులను ఎదుర్కొంటామన్నారు. గూడూరులో దళితుడిపై జరిగిన లాకప్ హింసను హైకోర్టు తీవ్రంగా పరిగణించిందని, దీనిపై జిల్లా ఎస్పీని కోర్టుకు హాజరుకావాలని ఆదేశించిందని గుర్తుచేశారు. దళిత యువకుడిని చిత్రహింసలకు గురిచేసిన వ్యవహారంలో సంబంధిత అధికారులు, సీఐ, ఎస్సై, కానిస్టేబు ల్‌ళ్లు కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ కూటమి నాయ కులు అక్రమ కేసులతో ప్రశ్నించే గొంతును నొక్కలేరని, జైల్లో సత్యనారాయణరెడ్డి ధైర్యంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తూ జైళ్లకు పంపుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ తరపున ఎవరు మాట్లాడినా వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం పాలన గాలికి వదిలేసి కేవలం ప్రతిపక్షమే లక్ష్యంగా రాజకీయ కక్ష సాధింపులకు దిగుతోందన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో అక్రమ దందాల గురించి ప్రశ్నిస్తే అరెస్ట్ట్‌లు చేస్తున్నారన్నారు. అక్రమ సంపాదన, అవినీతే ధ్యేయంగా సాగుతున్న కూటమి పాలనపై రాబోయే రోజుల్లో పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. కామిరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులో తనను ఇరికించి జైలుకు పంపాలని చూడగా కోర్టు ద్వారా బెయిల్ మంజూరు చేయించుకున్నానని తెలిపారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగి వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్న అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలని, రేపు వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుందన్నారు. జిల్లాలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఏకతాటిపై ఉన్నాయని, ఆయన నాయకత్వంలో కష్టపడి పనిచేసి పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామన్నారు.


