బుచ్చిరెడ్డిపాళెం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడలో కొలువైన మల్లికార్జునస్వామి సమేత కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం వెండి నందిసేవను నేత్రపర్వంగా నిర్వహించారు. మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి వెండి నంది వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవం జరిపారు. కామాక్షితాయికి శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానం వారు పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ అశోక్‌రెడ్డి, సహాయ కమిషనర్ వెంకట శ్రీనివాసులురెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
డీసీపల్లిలో 115 పొగాకు
బేళ్ల విక్రయం
మర్రిపాడు: డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో గురువారం 115 బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి సునీల్‌కుమార్ తెలిపారు. వేలానికి 189 బేళ్లు రాగా, 115 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు చెప్పారు. కిలో గరిష్టంగా రూ.250, కనిష్టంగా రూ.200, సగటు రూ.223.80 ధర పలికిందని తెలిపారు. వేలంలో ఏడు కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.
సచివాలయాన్ని
తనిఖీ చేసిన జేసీ
కొడవలూరు: మండలంలోని నార్తురాజుపాళెం–1 సచివాలయాన్ని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు, మూమెంట్, ప్రజావిజ్ఞప్తుల రిజిస్టర్లను పరిశీలించారు. హాజరు రిజిస్ట్టరులో కొందరి సంతకాలు లేకపోవడాన్ని చూసి ప్రశ్నించారు. గృహ గణన విధుల్లో ఉన్నందున సంతకాలు చేయలేదని సచివాలయ సిబ్బంది తెలిపారు. ప్రతిరోజూ విధులు ముగిశాక విధిగా సంతకాలు చేయాలని ఆదేశించారు. రిజిష్టర్‌లో విధిగా తేదీ, సమయం వేయాలని సూచించారు. సచివాలయాల్లో అందుతున్న సేవలను విధిగా బోర్డుపై ప్రదర్శించాలని ఆదేశించారు. జేసీ వెంట తహసీల్దార్ కే స్ఫూర్తిరెడ్డి, వీఆర్వో మల్లికార్జున, పంచాయతీ కార్యదర్శి విజయ్‌కుమార్, సచివాలయ సిబ్బంది ఉన్నారు.
డాక్టర్ వంశీకృష్ణసుమన్‌పై
చర్యలకు ఆదేశం
నెల్లూరు(అర్బన్): గతంలో వైద్యశాఖలో పని చేసే సమయంలో అధికారులకు చెప్పకుండా, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విధులకు గైర్హాజరవడం, అదే సమయంలో పీజీ చేస్తూ వైద్యశాఖ నుంచి రూ 24,62,714 వేతనాన్ని డ్రాచేసిన డాక్టర్ వంశీకృష్ణసుమన్‌పై చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఆదేశాలు జారీ చేశారు. వివరాలు..డాక్టర్ వంశీకృష్ణసుమన్ మర్రిపాడు మండలం కృష్ణాపురం పీహెచ్‌సీలో డాక్టర్‌గా చేరాడు. ఆయన 5 మే 2022 నుంచి 30 సెప్టెంబర్ 2024 వరకు విధులకు గైర్హాజరయ్యారు. అదే సమయంలో నారాయణ మెడికల్ కళాశాలలో పీడీయాట్రిక్ విభాగంలో పీజీ చేరాడు. ఈ కాలంలో ఒక్కరోజు కూడా విధులకు హాజరు కాకుండానే జీతాల రూపంలో రూ.24,62,714 ను డ్రా చేశాడు. అలాగే స్టైఫండ్ రూపంలో నారాయణ కళాశాలలో నెలకు రూ.30 వేలు వంతున డ్రా చేశాడు. ప్రభుత్వాన్ని మోసం చేసి ఇలా నిధులు డ్రా చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏపీ శాక్స్ రాష్ట్ర ఉన్నతాధికారి కామేశ్వరప్రసాద్ విచారణ చేపట్టారు. అలాగే మరో అధికారి రాధారాణి కూడా విచారణ చేశారు. ప్రాథమిక విచారణ 29 డిసెంబర్ 2024న జరిగింది. నివేదికను 24 డిసెంబర్ 2025న ప్రభుత్వానికి అందజేశారు. ఈ నివేదికలో డాక్టర్ అక్రమాలకు పాల్పడ్డాడని నిర్ధారించారు. ఉన్నతాధికారుల అనుమతులు లేకుండానే పీజీ చదివాడని తేల్చారు. ఈ నేపథ్యంలో ఆయనపై ప్రభుత్వం చర్యలకు పూనుకుంది.


