చికెన్‌ వ్యర్థాలతో కాసుల వేట | - | Sakshi
Sakshi News home page

చికెన్‌ వ్యర్థాలతో కాసుల వేట

May 15 2026 12:07 PM | Updated on May 15 2026 12:07 PM

నిత్యం వాహనాల్లో జిల్లాకు సరఫరా

పెరిగిన మేత ధరల నేపథ్యంలో

మరింత ఎక్కువగా..

80 డ్రమ్ములున్న వాహనమైతే

రూ.16 వేల మామూలివ్వాల్సిందే..

తమ్ముళ్ల అండతో చెలరేగుతున్న వైనం

ఆత్మకూరు: కొందరు అక్రమార్కుల స్వార్థం ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోంది. జిల్లాకు చికెన్‌ వ్యర్థాల రాక ఆగడం లేదు. రోజూ ఏదో ఒక మండలంలో వాహనాలను పట్టుకుంటూనే ఉన్నారు. సంగం, ముత్తుకూరు, కొడవలూరు, విడవలూరు, తదితర మండలాల పరిధిలో ఆక్వా సాగు తగ్గి చేపల గుంతల సాగు ఎక్కువైంది. రొయ్యలు అమ్ముకుందామంటే సరైన గిట్టుబాటు ధర లేకపోవడం, పెరిగిన ఖర్చుల నేపథ్యంలో పలువురు రైతులు దీనివైపు దృష్టి సారించారు. జిల్లా పరిధిలో సుమారు 2,717 హెక్టార్లలో చేపల గుంతలు సాగులో ఉన్నాయని సమాచారం. వీటి పెంపకంలో మేత ప్రధానమైంది. కంపెనీ మేతకు రూ.వేలు ఖర్చు చేయాలి. అందుకే చికెన్‌ వ్యర్థాల వైపు అనేకమంది మొగ్గుచూపారు.

33 వాహనాల పట్టివేత

ఏడాదిన్నర వ్యవధిలో ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోనే సంగం మండల పోలీసులు చికెన్‌ వ్యర్థాలను తీసుకొస్తున్న 33 వాహనాలను పట్టుకొని కేసులు నమోదు చేశారు. ఇక చిక్కకుండా తప్పించుకున్న వాహనాలు వందల సంఖ్యలో ఉంటాయని ప్రజలు అంటున్నారు. కొన్ని వాహనాలను పట్టుకుని తూతూమంత్రంగా కేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పటిష్ట చర్యలు చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. చేపల గుంతల వద్దనే ప్లాస్టిక్‌ డ్రమ్ముల్లో వ్యర్థాలు నిల్వ ఉంటుంటే వాటిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపడితే తప్ప దీనిని అరికట్టడం సాధ్యం కాదు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతోనే ఇది సాధ్యమవుతుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.

ఇటీవల

● ఈనెల ఒకటో తేదీన బెంగళూరు నుంచి అనంతసాగరం మండలంలో రేవూరు గ్రామానికి చికెన్‌ వ్యర్థాలను తరలిస్తున్న మినీ లానీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

● 12వ తేదీన సంగం మండలంలో మినీ లారీ, మరో వాహనంలో వ్యర్థాలను పట్టుకున్నారు.

● గత 27వ తేదీన మర్రిపాడు మండలంలో 20 డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు.

తెలుగు తమ్ముళ్ల దందా

అక్రమ దందాకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా బెంగళూరు నుంచి అధిక సంఖ్యలో మినీవ్యాన్లలో వ్యర్థాలు సరఫరా అవుతున్నాయి. చెక్‌పోస్ట్‌ సిబ్బంది, పోలీసులు, అధికార పార్టీ నాయకులకు మామూళ్లు ఇచ్చుకుంటూ నిరాటంకంగా వ్యర్థాలు మండలాలకు తరలిస్తున్నారు. కొన్ని వ్యాన్లలో 80 ప్లాస్టిక్‌ డ్రమ్ములు, మరికొన్నింట్లో 35 డ్రమ్ములు పేర్చుకొని సరఫరా చేస్తున్నారు. పెద్ద వ్యాన్‌కు రూ.16 వేల చొప్పున, చిన్నవ్యాన్లకు రూ.7 వేల చొప్పున టీడీపీ నాయకులు వసూలు చేస్తూ గ్రామాలకు ఆ వాహనాలు క్షేమంగా చేరేలా బాధ్యత వహిస్తున్నారు. ఫిషరీస్‌, చెక్‌పోస్ట్‌ అధికారులు, పోలీసులు, స్థానిక నాయకుల సహకారంతో ఈ దందా దర్జాగా కొనసాగుతోంది.

చికెన్‌ వ్యర్థాలపై నిషేధమున్నా అక్రమార్కులు తెలుగు తమ్ముళ్ల అండతో యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఈ తంతు బహిరంగంగానే జరుగుతున్నా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవడంలో విఫలమైందనే విమర్శలున్నాయి. వ్యర్థాల కారణంగా భూగర్భ జలాలు కలుషితమవ్వడంతోపాటు చేపలు తిన్న వారు రోగాల బారిన పడటం ఖాయం.

Advertisement
 
Advertisement
Advertisement