ఉదయగిరి: వరికుంటపాడు మండలంలోని నక్కలగండి రిజర్వాయర్‌లో రూ.కోట్ల విలువైన మత్స్య సంపదను కొల్లగొట్టే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి మత్స్యకార సహకార సంఘం ఉన్నప్పటికీ డమ్మీని చేసి పామూరుకు చెందిన ఓ వ్యక్తి కొన్ని సంవత్సరాల నుంచి సంపద దోచేస్తున్నాడు. అతను స్థానిక నేతలను గుప్పెట్లో పెట్టుకున్నాడని తెలిసింది. రెండు సంవత్సరాల నుంచి రిజర్వాయర్‌లో నీరు అధికంగా ఉండటంతో పూర్తి స్థాయిలో చేపలు వేట సాగలేదు. దీంతో వాటి బరువు బాగా పెరిగింది. ప్రస్తుతం సుమారు రూ.2 కోట్ల విలువైన మత్స్య సంపద ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
చేపలు కొల్లగొట్టే ప్రయత్నం
ఇటీవల తూముల ద్వారా నీరు బయటకు వదిలే ప్రయత్నాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నా అధికారులు మాత్రం తూము లీకేజీ నీరు మాత్రమే బయటకు వస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత రంగ ప్రవేశం చేసి చేపల వేట నిలిపివేయించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపలు పట్టించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ప్రైవేట్‌గా చేపల పట్టే వ్యక్తిని తమ దారిలోకి తెచ్చుకుని కొంత మొత్తం వసూలు చేసే ప్రయత్నాలు సాగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
నామమాత్రం
జిల్లాలో పలు మత్స్యకార సహకార సంఘాలు నామమాత్రంగా ఉన్నాయి. కొందరు ప్రభుత్వానికి రుసుము కట్టడం లేదు. దీనిని ఆసరాగా చేసుకున్న పలువురు వ్యక్తులు సొసైటీ ముసుగులో వచ్చి, వారికి నామమాత్రంగా నగదు ఇచ్చి మత్స్య సంపద దోచేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. ఉదయగిరి నియోజకవర్గం పరిధిలో చిన్నక్రాక రిజర్వాయర్ పరిధిలో ఉన్న పలు చెరువుల్లో సంపదను కాజేసే ప్రయత్నాలు జరగ్గా, కోర్టు ఆదేశాలతో బ్రేక్ పడింది. తాజాగా నక్కలగండి రిజర్వాయర్‌లో చేపల్ని కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. ఓవైపు ప్రభుత్వం మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటామని చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
రూ.కోట్ల స్వాహాకు రంగం సిద్ధం?
నిబంధనలకు విరుద్ధంగా
ప్రైవేట్ వ్యక్తి వేట
స్థానికుల అభ్యంతరంతో
తాత్కాలికంగా నిలుపుదల
మాకు సంబంధం లేదు
నక్కలగండి రిజర్యాయర్‌లో 50 శాతం మేర నీరు ఉంది. తూముల ద్వారా కొంత లీకేజీగా పోతుంది. ప్రాజెక్ట్‌లో నీరు వృథాగా వదిలే పరిస్థితి లేదు. జలాశయంలో నీరు ఉంటే దిగువ ప్రాంతంలో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండి ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుంది.
– రమేష్, ఏఈ, ఇరిగేషన్


