వైఎస్సార్‌సీపీ పాలనలో.. రూ.69 లక్షలు
టీడీపీ పాలనలో నెలకు ఖర్చు రూ.1.38 కోట్లకుపైగా..
మున్సిపల్ శాఖ మంత్రి ప్రాతినిద్యం వహిస్తున్న నెల్లూరు కార్పొరేషన్‌లో
అక్రమాలకు అంతు లేకుండా పోయింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలుగు తమ్ముళ్లకు ఆర్థికంగా ప్రయోజనం కలిగించే వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఇటీవల మొక్కల పెంపకం పేరుతో రూ.కోట్ల నిధులను ఆరగించారు. అలాగే చెత్త తరలింపు పేరుతో కొందరి జేబుల్ని నింపుతున్నారు.
నెల్లూరు(బారకాసు): కార్పొరేషన్ పరిధిలో 54 డివిజన్లున్నాయి. సుమారు 10 లక్షల జనాభా ఉన్నారు. నిత్యం 320 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. అసలే పారిశుద్ధ్యం గాడినపడటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదికి సుమారు రూ.40 కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటి చెత్త సేకరణకు క్లాప్ వాహనాలను ఏర్పాటు చేశారు. అందులో తడి, పొడిచెత్తను వేర్వేరుగా సేకరించేవారు. ఒక్కో వాహనానికి రోజుకు రూ.2,300 చొప్పున నెలకు రూ.69 వేలు కార్పొరేషన్ చెల్లించేది. వంద క్లాప్ వెహికల్స్‌కు నెలకు రూ.69 లక్షలిచ్చారు. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెత్త తరలింపు వాహనాలను ఉంచకూడదని భావించింది. క్లాప్ వెహికల్స్ మరమ్మతులకు గురయ్యాయన్న సాకుతో మూలనపడేసి వాటి స్థానంలో ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు.
వారి కోసమే..
నగరంలో చెత్త తరలింపునకు అద్దె ప్రాతిపదికన ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. ఒక్కోదానికి రోజుకు రూ.3,750 చొప్పున నెలకు రూ.1,12,500 చెల్లిస్తున్నారు. ప్రారంభంలో 123 ట్రాక్టర్లను ఏర్పాటు చేసి వాటికి నెలకు రూ.1,38,37,500 ఇచ్చారు. ప్రస్తుతం 116 ట్రాక్టర్లకు నెలకు రూ.1,30,50,000 చెల్లిస్తున్నారు. ఏడాదిగా వాహనాలకు అధిక మొత్తంలో అద్దె చెల్లించినట్లుగా తెలుస్తోంది. కాగా ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని తెలుగు తమ్ముళ్లకే కల్పించారు. వాస్తవానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటా సేకరించిన చెత్తను ట్రాక్టర్ల ద్వారా తరలించాల్సి ఉంది. కానీ కేవలం రోజుకు రెండు, మూడు ట్రిప్పులే చెత్తను తరలించేసి ఆ తర్వాత ఇటుక, ఇసుక తరలించుకుంటూ తెలుగు తమ్ముళ్లు తమ జేబులు నింపుకొంటున్నారన్న విమర్శలున్నాయి.
దోచుకోవడమే..
ప్రజా ధనాన్ని ఇష్టారీతిన పచ్చ నేతలు దోచుకోవడంపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మొక్కల పేరుతో రూ.కోట్లు స్థానిక టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అదే తరహాలో ఇంటింటి చెత్త సేకరణ కోసమని నేతల ద్వారా ట్రాక్టర్లను ఏర్పాటు చేయించి వాటికి ఎన్‌ఎంసీ అధికారులు రూ.కోట్లు అద్దె చెల్లించడం జరుగుతోంది. తమ్ముళ్లకు లబ్ధి చేకూరుస్తుంటే కార్పొరేషన్ ఖజానా ఖాళీ కాకుండా ఎలా ఉంటుందనే ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఇదేవిధంగా కొనసాగుతుంటే నగరాభివృద్ధి ఎలా సాధ్యపడుతుందని అడుగుతున్నారు. మౌలిక సదుపాయాలు ఎలా కల్పిస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
కేవలం మాటల మంత్రి
మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ నేతలు లబ్ధి పొందేలా పలు పనుల పేరిట రూ.కోట్లు నిధులు నీళ్లలా ఖర్చు చేస్తుండటాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దౌర్జన్యం చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం, లేకుంటే కేసులు పెట్టించడం జరుగుతోందని విమర్శలున్నాయి. ఓవైపు పాలనా వ్యవస్థలో ఏదైనా పొరపాట్లుంటే తన దృష్టికి తీసుకొస్తే సరిదిద్దుకుంటామని మంత్రి పదేపదే మీడియా ఎదుట చెబుతున్నారు. అలాంటిది ఆయనే తెలుగు తమ్ముళ్లకు అడ్డదారిలో నిధులు అందించడం చర్చకు దారి తీస్తోంది. నారాయణ కేవలం మాటలకే పరిమితమనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ శాఖా మంత్రి ఇలాకాలో
ఇష్టారాజ్యం
చెత్త తరలింపు పేరుతో అక్రమాలు
అద్దె ట్రాక్టర్ల ఏర్పాటు
కార్పొరేషన్‌పై అదనపు భారం


