● ప్రాణాలు పోతున్నా రోడ్లు బాగు చేయరా?
● ప్రశ్నించిన జెడ్పీటీసీ సభ్యులు
● సీఈఓ ఆధ్వర్యంలో జెడ్పీ స్థాయీ
సంఘ సమావేశాలు
నెల్లూరు(పొగతోట): ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలవుతోంది. ఇంత వరకు ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదు. ఎప్పుడిస్తారో చెప్పండి’ అంటూ జెడ్పీటీసీ సభ్యులు అధికారులను ప్రశ్నించారు. నెల్లూరులోని జెడ్పీ కార్యాలయంలో సీఈఓ శ్రీధర్‌రెడ్డి, వైస్ చైర్‌పర్సన్ ప్రసన్న ఆధ్వర్యంలో బుధవారం స్థాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్, హౌసింగ్, వ్యవసాయం, డీఆర్‌డీఏ, డ్వామా, విద్య, సంక్షేమ శాఖలపై సమీక్షించారు.
ప్రజలు అడుగుతున్నారు
గ్రామాల్లోకి వెళ్తే పింఛన్లు మంజూరు చేయించాలని ప్రజలు అడుగుతున్నారని డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి దృష్టికి పలువురు సభ్యులు తీసుకెళ్లారు. వారికి ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పీడీ స్పందించి మరణించిన వారి స్థానంలో కొత్త పింఛన్లు ఇస్తున్నామన్నారు. కొత్త వాటికి దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వలేదన్నారు. వితంతు పెన్షన్ల కోసం కలెక్టరేట్‌కు అనేకమంది వచ్చి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు ఇస్తున్నారని, దీనిపై స్పష్టత ఇవ్వాలని సీఈఓ చెప్పారు. దీంతో పీడీ స్పందించి వితంతు పింఛన్లకు సంబంధించి గైడ్‌లైన్స్ ఇంతవరకు రాలేదన్నారు.
● ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు అడుగంటి పోయాయని, అనేక గ్రామాల్లో ప్రజలు మంచినీటికి ఇబ్బందులు పడుతున్నారని సభ్యులు వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసి ప్రజల దాహార్తిని తీర్చాలని కోరారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి జిల్లా వ్యాప్తంగా 2,265 పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 1,819 పనులు పూర్తయ్యాయన్నారు. 197 పనులు ప్రారంభం కాలేదని వెల్లడించారు.
● ఉపాధి పనులకు హాజరవుతున్న శ్రామికులకు సకాలంలో వేతనాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని, గ్రావెల్ రోడ్లకు అనుమతి ఇవ్వాలని సభ్యులు కోరారు. డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్ సమాధానమిస్తూ గ్రావెల్ రోడ్లు వేయడానికి అనుమతులు లేవన్నారు.
● జగనన్న కాలనీల్లో ఖాళీగా ఉన్న స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని అనంతసాగరం జెడ్పీటీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అర్హులైన ప్రజల కోసం వాటిని ఖాళీగా ఉంచడం జరిగిందన్నారు. ఆక్రమించిన వారిని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య జిల్లా వ్యాప్తంగా ఉందని, చర్యలు తీసుకుంటామని సీఈఓ తెలిపారు.
● గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అంటూ కొందరు సభ్యులు అధికారులను ప్రశ్నించారు. త్వరితగతిన మరమ్మతులు చేయించాలన్నారు. విద్యుత్ కోతలతో ప్రజలు నరకం చూస్తున్నారని సభ్యులు వెల్లడించారు. ఉదయం ఉక్కపోత, రాత్రి దోమల బెడద అధికంగా ఉందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సరఫరా లేకపోతే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి సభ్యులు తీసుకెళ్లారు.
● విజయదీపిక పుస్తకంతో ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని విద్యాశాఖ అధికారులు జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏఎస్‌పేట బీసీ హాస్టల్ మరమ్మతులకు జెడ్పీ నుంచి రూ.10 లక్షలు మంజూరు చేసిన కృతజ్ఞతలు తెలిపారు. సమావేశాల్లో జెడ్పీ డీప్యూటీ సీఈఓ విజయకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


