కోవూరు: నెల్లూరు శ్రీనివాస అగ్రహారానికి చెందిన పులిమి లీలావతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి బుధవారం వెళ్లి లీలావతమ్మ కుమారుడు పులిమి రమేష్‌రెడ్డి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. నల్లపరెడ్డి కుటుంబ సభ్యులు రాజేంద్రరెడ్డి, జగదీష్‌రెడ్డి తదితరులు పులిమి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
రెండు కుటుంబాల మధ్య ఘర్షణ
● పోలీసులకు ఫిర్యాదు
అనుమసముద్రంపేట: రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగిన ఘటన అనుమసముద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బొద్దుకూరు హజరత్‌రెడ్డి, బొద్దుకూరు వివేకానందరెడ్డి పక్కపక్కనే నివాసం ఉంటారు. రెండు ఇళ్ల మధ్యలో ప్రభుత్వానికి చెందిన పాత చావడి స్థలం ఉంది. ఇది కొన్ని సంవత్సరాల నుంచి వివేకానందరెడ్డి ఆధీనంలో ఉంది. బుధవారం జేసీబీతో ఆ స్థలాన్ని చదును చేయించే క్రమంలో హజరత్‌రెడ్డి ఇంటి గోడలు, రేకులు కూలిపోయాయి. దీంతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. పాతకక్షలతోనే తనను అంతమొందించేందుకే వివేకానందరెడ్డి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో హజరత్‌రెడ్డి పేర్కొన్నారు. విచారణ చేసి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
చెట్టును ఢీకొట్టిన బైక్
● యువకుడి మృతి
పొదలకూరు: మండలంలోని సోమశిల – పొదలకూరు రోడ్డు వనంతోపు సెంటర్‌కు సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. పొదలకూరు పట్టణానికి చెందిన ఆకాష్ (21) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తూనే ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ను కూడా నిర్వహిస్తుంటాడు. అర్ధరాత్రి బైక్‌పై చేజర్ల మండలం నాగులవెల్లటూరు గ్రామానికి వెళ్తూ లారీని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి పొదలకూరు సీహెచ్‌సీకి తరలించారు. అయితే అప్పటికే ప్రాణాలు విడిచినట్టు సీహెచ్‌సీ వైద్య సిబ్బంది నిర్ధారించారు. పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.
పని చేయకుంటే
వేరే జిల్లాకు బదిలీ చేస్తాం
● డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్
నెల్లూరు(పొగతోట): ఉపాధి హామీ శ్రామికులకు పనులు కల్పించడంలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిని ఇతర జిల్లాలకు బదిలీలు చేస్తామని డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్ హెచ్చరించారు. బుధవారం నెల్లూరులోని డ్వామా కార్యాలయం నుంచి వివిధ మండలాల ఏపీఓలు, ఈసీలు, టీఏలు, ఎఫ్‌ఏలతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉపాధి పనులకు హాజరయ్యే శ్రామికుల సంఖ్య 42 వేలు ఉందన్నారు. దీనిని క్రమంగా పెంచేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రోజూ గ్రామాల్లో పర్యటించి పనులు గుర్తించాలన్నారు. శ్రామికులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎండ తీవ్రత నేపథ్యంలో పని ప్రదేశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
కండలేరులో
42 టీఎంసీలు..
రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 42 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,050, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 80, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 65 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.120
సన్నవి : రూ.32
పండ్లు : రూ.20


