అక్రమ లేవుట్లపై డీటీసీపీ మెరుపు దాడులు | - | Sakshi
Sakshi News home page

అక్రమ లేవుట్లపై డీటీసీపీ మెరుపు దాడులు

May 14 2026 6:39 AM | Updated on May 14 2026 6:39 AM

24 అనధికార లేఅవుట్ల గుర్తింపు

నెల్లూరు(బారకాసు): నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (నుడా) పరిధిలోని అనధికార లేఅవుట్లపై డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ) అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. బుధవారం నుడా పరిధిలోని బుచ్చిరెడ్డిపాళెం, వెంకటాచలం, బోగోలు, రాపూరు, జలదంకి, కావలి, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, వరికుంటపాడు మనుబోలు మండలాల్లో 128.94 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 24 అనధికార లేఅవుట్లను గుర్తించారు. డీటీసీపీ అధికారులు పది బృందాలుగా ఏర్పడి పది మండలాల్లోని అనధికార లేఅవుట్లపై మెరుపు దాడులు చేశారు. ఈ సందర్భంగా డీటీసీపీ అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోని లేఅవుట్‌దారులకు భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అనుమతి తీసుకోని వాటిని 22–ఏ నిషేధిత జాబితాలో పెడతామని హెచ్చరించారు. అనధికార లేవుటలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయబోమని స్పష్టం చేశారు. అలాగే బ్యాంక్‌లు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు కూడా మంజూరు కావన్నారు. భవిష్యత్‌లో డబుల్‌ రిజిస్ట్రేషన్లు కూడా అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇదే సమయంలో అనధిక లేఅవుట్లలో ప్లాట్ల క్రయ, విక్రయాలు, ఇతర లావాదేవీలు నిలిపివేయాలని రిజిస్ట్రేషన్‌ శాఖకు ఆదేశాలు జారీ చేశామన్నారు. విద్యుత్‌ కనెక్షన్‌ కూడా ఇవ్వొద్దని సంబంధిత శాఖకు లేఖ పంపామన్నారు. నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement