సిటీలో నయా జోష్‌ | - | Sakshi
Sakshi News home page

సిటీలో నయా జోష్‌

May 1 2026 5:27 AM | Updated on May 1 2026 5:27 AM

కూటమి ప్రభుత్వంపై

విసిగిపోయిన టీడీపీ కార్యకర్తలు

వైఎస్సార్‌సీపీలో పెరిగిన చేరికలు

నెల్లూరురూరల్‌: నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీలో కొత్త జోష్‌ నెలకొంది. ఈ రెండు సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా పెరిగింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలో కొత్త జోష్‌ నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిటీలో టీడీపీ నేతల అవినీతి, అక్రమాలకు అంతే లేకుండా పోయింది. రోడ్ల మరమ్మతులు, మొక్కల పెంపకం తదితర వాటి పేరుతో ప్రజా సొమ్మును నేతలు స్వాహా చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను పర్వతరెడ్డి ఎండగడుతూ అవినీతి, అక్రమాలపై గళమెత్తుతున్నారు. డివిజన్లలో ఆయన పర్యటిస్తూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారు. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకునేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత రావడం, వైఎస్సార్‌సీపీపై నమ్మకం పెరగడంతో ఇతర పార్టీల నుంచి అనేక మంది వచ్చి పర్వతరెడ్డి సమక్షంలో కండువా కప్పుకొంటున్నారు.

విస్తృతంగా..

వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ వంటి అనుబంధ సంఘాలతో సమన్వయం పెంచుతూ ఉపాధ్యాయులు, మేధావులను పార్టీ వైపు ఆకర్షించే యత్నం చేస్తున్నారు. సమావేశాలు, చర్చావేదికల ద్వారా పార్టీ సిద్ధాంతాలను చంద్రశేఖర్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై ఆయన మండలిలో, బయట ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రజల సమస్యల కోసం ఎంత దూరమైనా వెళ్తారనే నమ్మకం కార్యకర్తల్లో బలపడుతోంది. ఇటీవల టీడీపీకి చెందిన అనేక మంది వైఎస్సార్‌సీపీలో చేరడం కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను తెలియజేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement