జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను పొందేందుకు బాధితులు నరకం చూస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వాటిని కేవలం వారం రోజుల్లోనే మంజూరు చేసేవారు. కూటమి ప్రభుత్వంలో అడ్డమైన నిబంధనలు చేర్చడంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆస్పత్రిలో పడిగాపులు కాస్తున్నారు. ఇక్కడికి ఎక్కువగా నిరుపేదలు వస్తుంటారు. వారు ఆస్పత్రి అధికారులను ప్రశ్నించలేక తమకు ఎప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.
నెల్లూరు(అర్బన్): పెద్దాస్పత్రిలో రోజూ అవుట్ పేషెంట్ల (ఓపీ) సంఖ్య 1,500, ఇన్‌పేషెంట్ల సంఖ్య 450 నుంచి 500 వరకూ ఉంటోంది. రోజూ సుమారు 15 నుంచి 20 వరకు కాన్పులు జరుగుతున్నాయి. అలాగే చికిత్స పొందుతూ ముగ్గురు నుంచి ఐదుగురి వరకు చనిపోతున్నారు. కాన్పు జరిగాక తల్లిదండ్రులు సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుతూ ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటారు. తమ బిడ్డను స్కూల్లో చేర్చాలన్నా.. అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పి ంచాలన్నా.. ఇతర అవసరాలకు బర్త్ సర్టిఫికెట్ కచ్చితంగా అవసరం. అలాగే ఎవరైనా మృతిచెందితే వారి కుటుంబ సభ్యులు మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంటుంటారు. బీమా పరిహారం, ప్రభుత్వ సాయం, వితంతు పెన్షన్ తదితరాలు పొందాలంటే ఇది తప్పనిసరి. అందువల్లే బాధిత కుటుంబం వారు త్వరగా మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందాలని ఆరాటపడుతూ ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నారు.
ఒకరే ఉండటంతో..
జనన, మరణ ధ్రువపత్రాలిచ్చేందుకు అభ్యర్థులకు చెందిన ఆధార్‌కార్డు, ఆస్పత్రిలో డిశ్చార్జి అయిన స్లిప్, కుటుంబ సభ్యుల సమాచారం తదితర వివరాలను ఆన్‌లైన్‌లో ముందుగా నమోదు చేయాలి. ఆధారాలతో కూడిన ఫొటో స్టాట్ కాపీలు అప్‌లోడ్ చేయాలి. ఇవన్నీ చేయడానికి కేవలం ఒకే ఒక్క డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ) మాత్రమే ఉన్నారు. ఆపరేటర్ సెలవు పెడితే పత్రాల మంజూరు జరగడం లేదు. కనీసం ఇద్దరు వ్యక్తులు ఉండి రెండు కంప్యూటర్లను ఏర్పాటు చేస్తేనే రద్దీ తగ్గుతుంది. అయితే సూపరింటెండెంట్ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో పత్రాల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోందని విమర్శలున్నాయి.
400 వరకు పెండింగ్
పెద్దాస్పత్రిలో జనన, మరణ ధ్రువీకరణపత్రాలు 400 వరకు పెండింగ్‌లో ఉన్నాయి. సర్వర్ మెరాయిస్తుండటంతోపాటు ఒకే డీఈఓ ఉండటంతో పత్రాలను సకాలంలో ఇవ్వకుండా తిప్పుకొంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించి సకాలంలో పత్రాలను మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పెద్దాస్పత్రిలో జనన, మరణ పత్రాల మంజూరులో జాప్యం
పెండింగ్‌లో 400 వరకు సర్టిఫికెట్లు
సర్వర్ సమస్య అంటూ చేతులెత్తేసిన వైద్యశాఖ
రోజుకు ఐదారుగురికి కూడా
ఇవ్వలేకపోతున్న వైనం
నెలల తరబడి తిరుగుతున్న బాధితులు
సర్వర్ సమస్యపై
ఈ–మెయిల్ పెట్టాం
సర్వర్ మొరాయిస్తుండడంతో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరులో జాప్యం జరుగుతోంది. సర్వర్ సమస్యను సూపరింటెండెంట్ మాధవి దృష్టికి తీసుకెళ్లి సరి చేయాలని వైద్యశాఖకు ఈ–మెయిల్ పెట్టించాం. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది. ఆలస్యం కాకుండా పత్రాలు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నాం.
– డాక్టర్ కళారాణి, అడ్మినిస్ట్రేటివ్ హెచ్‌ఓడీ


