● పెంచలకోనకు పోటెత్తిన భక్తులు
● శేష వాహనంపై నృసింహుడు
రాపూరు: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేదపండితులు నిర్వహించారు. దేవతలారా రారండి ఐదురోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయండంటూ గరుత్మంతుడి ద్వారా ముక్కోటి దేవతలకు ఆహ్వానం పంపారు. వివిధ పూజా కార్యక్రమాలు జరిగాయి. స్వామిని తిరుచ్చిపై కొలువుదీర్చి నాలుగు తిరుమాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. అక్కడ్నుంచి ధ్వజస్తంభం వద్దకు చేరుకుని అర్చకులు గరుత్మంతుడి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. ధ్వజస్తంభానికి అభిషే కాలు నిర్వహించారు. తొలుత అష్టదిగ్భంధనం చేసి వేద, దివ్య, మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ గరుత్మంతుడి చిత్రపటాన్ని ధ్వజస్తంభంపైకి ఎగురవేశారు. కార్యక్రమంలో డీసీ జనార్దనరెడ్డి, ఫెస్టివల్ కమిటీ సభ్యులు చెన్నుతిరుపాల్‌రెడ్డి, ఉప ప్రధానార్చకులు పెంచలయ్యస్వామి, సీతా రామయ్యస్వామి, టీటీడీ పాంచరాత్ర ఆగమ పండితులు రామానుజాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
● బ్రహ్మోత్సవాల్లో జరిగే ధ్వజారోహణానికి ఎంతో విశిష్టత ఉంది. గరుత్మంతుడికి పూజలు అభిషేకాలకు ఉపయోగించిన ప్రసాదాలను స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. సంతానం లేని మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రసాదాన్ని స్వీకరించారు.
● స్వామి, అమ్మవార్లకు క్రేన్ మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను పీఠంపై ఉంచి పాలు, తేనె, నెయ్యి, పెరుగు, పండ్లరసాలు, చందనం, పసుపు, కుంకుమ, కొబ్బరినీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు.
● లక్ష్మీనరసింహస్వామికి కాణిపాకంలోని వరసిద్ధి వినాయక దేవస్థానం నుంచి ఈఓ పెంచలకిషోర్ తమ సిబ్బందితో కలిసి పట్టువస్త్రాలు సమర్పించారు.
● బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మి దేవేరులను తిరుచ్చిలో కొలువుదీర్చి వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి ఊంజల్‌సేవ నిర్వహించారు.
● రాత్రి 10 గంటలకు స్వామి, అమ్మవార్లను శేషవాహనంపై ఊరేగించారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు
బుధవారం ఉదయం 5 గంటలకు పూలంగిసేవ, 8 గంటలకు హంస వాహనసేవ, 11:50 గంటలకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపాలంకారసేవ నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు బంగారు హనుమంత వాహనంపై శ్రీవారి క్షేత్రోత్సవం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.


