కోట: విద్యానగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాల నుంచి ఈనెల 15వ తేదీన బాలిక అదృశ్యమైన ఘటనపై విచారణ జరిపి నిందితులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పవన్‌కుమార్ మంగళవారం తెలిపారు. బాలికను అపహరించిన నెల్లూరుకు చెందిన దావూద్‌తోపాటు అతడికి సహకరించిన సలీం, షమీర్, మునీర్, హర్షియాపై పోక్సో కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు ఎస్సై వెల్లడించారు.
ట్రావెల్స్ బస్సు ఢీకొని..
● ట్రాక్టర్ డ్రైవర్ మృతి
చిల్లకూరు: ట్రావెల్స్ బస్సు ఢీకొని ఓ డ్రైవర్ మృతిచెందిన ఘటన మంగళవారం జరిగింది. చిల్లకూరు కథనం మేరకు.. మండలంలోని నెలబల్లిరెట్టపల్లికి చెందిన చిరమన వెంకటేశ్వర్లు (53)కు భార్య, ముగ్గురు ఆడపిల్లలున్నారు. గ్రామంలో ఉన్న ట్రాక్టర్ యజమాని వద్దకు వెళ్లి యాక్టింగ్ డ్రైవర్‌గా ఉంటానని చెప్పాడు. అతను బోరులో వేసేందుకు అవసరమైన రాయిని నెల్లూరులో డెలివరీ చేయాలని చెప్పాడు. దీంతో వెంకటేశ్వర్లు గ్రామం నుంచి ట్రాక్టర్‌లో బయలుదేరాడు. పది నిమిషాలకు జాతీయ రహదారి ఎక్కి కోట క్రాస్‌రోడ్డు సమీపంలోకి వచ్చేసరికి మైసూర్ నుంచి విజయవాడకు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ కొంతదూరం వెళ్లి పడగా ట్రక్కు అక్కడే నిలిచిపోయింది. వెంకటేశ్వర్లు రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. కొంతమంది వేరే బస్సుల్లో వెళ్లిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అలాగే ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్సై సురేష్‌బాబు మాట్లాడుతూ బస్సును స్టేషన్‌కు తరలించి డ్రైవర్‌ను విచారిస్తున్నామన్నారు. కేసు నమోదు చేశారు.
రైలు కిందపడి
వ్యక్తి ఆత్మహత్య
మనుబోలు: రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని మనుబోలు రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. మనుబోలు రైల్వేస్టేషన్ సమీపంలోని డౌన్‌లైన్‌లో 145/8 కిలోమీటర్ వద్ద ఓ వృద్ధుడి మృతదేహాన్ని సిబ్బంది గుర్తించారు. తల వేరుగా, మొండెం వేరుగా ఉంది. వయస్సు 70 సంవత్సరాలని భావిస్తున్నారు. ఐదున్నర అడుగుల ఎత్తు, చామనఛాయతో ఉన్నట్లు తెలిపారు. వైట్‌కలర్ ఫుల్ హ్యాండ్ షర్టు, బ్లూ కలర్ గళ్లలుంగీ ధరించి ఉన్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.


