నెల్లూరు(వీఆర్సీసెంటర్): పెట్రోల్, డీజిల్ కొతర కారణంగా రైతులు, ప్రజలు అవస్థలు పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి అన్నారు. నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడురోజుల నుంచి ఇంధనం లేకపోవడంతో జిల్లాలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రధానంగా వరికోతల సమయం కావడంతో పెట్రోల్ బంకులకు వెళ్తున్న రైతులకు డీజిల్ పట్టడం లేదని ఆరోపించారు. అధికార యంత్రాగం మాత్రం పెట్రోల్, డీజిల్ సమస్య లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికే జిల్లాలో చాలా బంకులు మూసివేశారని, కొన్నింట్లో నో స్టాక్ బోర్డులు పెడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రామరాజు, మాలకొండయ్య, సిరాజ్, షాన్‌వాజ్, ఆదినారాయణ, లీలామోహన్, సాయిలత, వనజ, హేమలత, అజీజ్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.


