జనన, మరణాల వివరాలను వైద్యశాఖకు చెందిన వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. ఆ తర్వాత సర్టిఫికెట్లను డౌన్‌లోడ్ చేసివ్వాలి. ఇందుకోసం కేవలం ఒకే ఒక్క డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమించారు. కంప్యూటర్ కూడా ఒకటే ఉంది. దీనికితోడు సర్వర్ మొరాయిస్తూ వెబ్‌సైట్ పనిచేయకపోవడంతో వివరాల నమోదులో జాప్యం జరుగుతోంది. రెండు నెలల క్రితం నిబంధనల్లో మార్పులు చేశారు. అప్పట్నుంచి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసినా పట్టుమని పదిమందికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వలేకపోతున్నారు. ఒక్కోరోజు ముగ్గురికి, నలుగురికి మాత్రమే ఇస్తున్నారు. మరోరోజు ఎనిమిది మందికి మాత్రమే దక్కుతుంది. దీంతో బాధితులు సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి పెద్దాస్పత్రి చుట్టూ తిరుగుతున్నారు.


