మర్రిపాడు/కలిగిరి: జిల్లాలోని కలిగిరి, మర్రిపాడు మండలంలోని డీసీపల్లి పొగాకు వేలం కేంద్రాల్లో గురువారం నుంచి వేలం ప్రారంభమవుతుంది. గతేడాది ధరలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు నష్టాలను చవిచూశారు. ఈ ఏడాదైనా గిట్టుబాటు ధర లభిస్తుందా అనే ఆశతో ఎదురుచూస్తున్నారు. వేలం నేపథ్యంలో రైతుల్లో ఓవైపు ఆశ, మరోవైపు ఆందోళన కనిపిస్తోంది. సాగు ఖర్చులు గణనీయంగా పెరిగిన పరిస్థితుల్లో వేలంలో లభించే ధరలే రైతుల ఆర్థిక పరిస్థితిని నిర్ణయించనున్నాయి. గిట్టుబాటు ధర లభిస్తేనే ఖర్చులు తిరిగి వచ్చి కొంతమేర లాభం సాధ్యమవుతుందని, లేదంటే మరోసారి భారీ నష్టాలు తప్పవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభావం చూపే అవకాశం
ఉత్పత్తి అధికంగా ఉండటం కూడా ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఒక్క బ్యారన్‌కు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అదనపు భారం పడినట్లు పేర్కొంటున్నారు. ఎరువులు, కూలీలు, ఇంధన ధరలు పెరగడం రైతులపై భారంగా మారింది. ఈ నేపథ్యంలో కిలోకు కనీసం రూ.300 ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గత సంవత్సరం వేలం ముగిసే సమయానికి కిలోకు సరాసరి ధర రూ.219.40 మాత్రమే లభించింది. గరిష్ట ధర రూ.345 వరకు నమోదైనా, కనిష్ట ధర రూ.130 వరకు పడిపోవడం తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ సీజన్‌లో వ్యాపారులు ఎంతమేరకు పోటీగా కొనుగోళ్లు చేస్తారు?, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ఎలా ఉంటాయి?, పొగాకు బోర్డు ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకుంటుందన్న అంశాలే ధరలను నిర్ణయించనున్నాయి. ధరలపై ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నదాతలు కోరుతున్నారు. వేలం ప్రారంభమైన తొలిరోజే ధరల ధోరణి ఎలా ఉంటుందనే దానిపై రైతులంతా దృష్టి సారించారు. కాగా గ్రేడింగ్ సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
పొగాకు బేళ్లు
కలిగిరి పొగాకు వేలం కేంద్రం
దిగుబడి అంచనా : 10.20
మిలియన్ కిలోలు
నేటి నుంచి పొగాకు వేలం ప్రారంభం
గిట్టుబాటు ధర దక్కేనా?
కిలోకు రూ.300 ఇవ్వాలని
రైతుల డిమాండ్
జిల్లాలో కలిగిరి, మర్రిపాడుల్లో కేంద్రాలు


