● బోన్‌మ్యారో లాంటి ఖరీదైన
పరీక్షలు ఉచితం
● ప్రభుత్వ మెడికల్ కళాశాల
ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి
నెల్లూరు(అర్బన్): ప్రభుత్వ మెడికల్ కళాశాల పెథాలజీ (వ్యాధి నిర్ధారణ) ల్యాబ్‌కు హైదరాబాద్‌కు చెందిన మౌరి టెక్ ఫౌండేషన్ ఎండీ అనిల్ యర్రంరెడ్డి రూ.4 లక్షల విలువైన పరికరాలను వితరణగా అందించారు. ఈ సందర్భంగా బుధవారం దర్గామిట్టలోని మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి పెథాలజీ విభాగం హెచ్‌ఓడీ ప్రొఫెసర్ డాక్టర్ సాయిప్రసాద్‌తో కలిసి మాట్లాడారు. నెల్లూరుకు చెందిన డాక్టర్ రజని, డాక్టర్ గోకుల్ చంద్రారెడ్డి సహకారంతో మౌరి టెక్ ఫౌండేషన్ ఎండీ అనిల్ సీఎస్‌ఆర్ నిధుల కింద నాలుగు ఒలంపస్ హై ఎండ్ రిపోర్టింగ్ బైనాక్యులర్ మైక్రోస్కోప్‌లను, డెల్ డెస్క్‌టాప్, మానిటర్, హెచ్‌పీ లేజర్ ప్రింటర్ తదితర వాటిని అందించారన్నారు. ఈ హైక్వాలిటీ పరికరాలతో కేన్సర్ లాంటి పరీక్షలను అత్యంత కచ్చితత్వంతో చేసి ఫలితాలను నిర్ధారించవచ్చన్నారు. పేద, మధ్య తరగతి రోగులకు ఎలాంటి ఖర్చు లేకుండా అన్ని రకాల పరీక్షలు ఇక్కడ చేస్తున్నామన్నారు. బోన్‌మ్యారో లాంటి అత్యంత ఖరీదైన పరీక్షలు సైతం పేదలకు చేస్తున్నట్లు చెప్పారు. రక్త సంబంధిత పరీక్షలతోపాటు గడ్డలను బయాప్సీ చేయడం లాంటి వాటితో రోగులకు త్వరగా వ్యాధి నిర్ధారణ జరుగుతుందన్నారు. డయాగ్నోసిస్ పరీక్షలు అత్యంత ఖరీదైన నేపథ్యంలో పేద రోగులకు ఉపయోగపడేలా పెథాలజీ పరికరాలు అందించిన మౌరి టెక్ సంస్థ ఎండీకి అభినందనలు తెలిపారు. జిల్లాలో ఉండే పారిశ్రామికవేత్తలు, దాతలు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆస్పత్రికి ఉపయోగపడే ల్యాబ్ పరికరాలు విరాళాలుగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పెథాలజీ అసోసియేట్ ప్రొఫెసర్లు డా.కృష్ణమూర్తి, డా.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


