కలువాయి(సైదాపురం): అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. రాజుపాళెంలో ఏకంగా పెన్నానదిలోకి రహదారి నిర్మించి యథేచ్ఛగా టిప్పర్లలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తెలుగురాయపురం, రాజుపాళెం నుంచి రోజుకు వందల లారీల్లో ఇసుక తరలివెళ్తోంది. దీనివల్ల పెన్నానది ప్రవాహానికి ముప్పు ఏర్పడుతుందని తెలిసినా ఆపేందుకు ఏ అధికారి సాహసించడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారులు గుంతలమయంగా మారి వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల కుల్లూరు హైవే పక్కన ఇసుక డంపింగ్ యార్డ్ అనధికారికంగా ఏర్పాటు చేశారు. అంతేగాక హైవేపై టిప్పర్ల రాకపోకల కారణంగా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.


