● అన్యాయం జరిగితే సహించేదిలేదు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మత్స్యకారులకు అన్యాయం జరిగితే సహించేదిలేదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో నిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల ఆస్తి, హక్కు అన్నారు. ప్రాణాలకు తెగించి వారు పట్టుకున్న నాలుగు బోట్లను అధికారులు, నేతలు కుమ్మకై ్క వదిలేశారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యంతోనే ఇవి తరలివెళ్లాయని టీడీపీ నేతలు అంగీకరిస్తున్నారానని ప్రశ్నించారు. మత్స్యకారుల అభివృద్ధి తమ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. బోట్లను వెనక్కి తెప్పించి, తమ చిత్తశుద్ధిని టీడీపీ నేతలు నిరూపించుకోవాలని హితవు పలికారు. బోట్ల మాయం విషయంలో బీఎమ్మార్ పేరును తాము ప్రస్తావించలేదని, ఇస్కపల్లి కాపు తోటయ్యే వాంగ్మూలంలో చెప్పిన అంశాన్ని గుర్తుచేశారు. తనకు ఆయన ఫోన్ చేసి.. రూ.10 లక్షల చొప్పున ఇస్తానని.. బోట్లను వదిలేయమన్నారని.. రెండు నెలల నుంచి ఇది జరుగుతోందని తోటయ్యే చెప్పారన్నారు. బీఎమ్మార్ ప్రమేయం లేకపోతే ఆయన ఒక్కరి పేరునే ఎందుకు చెప్పారని ప్రశ్నించారు.
విడ్డూరంగా రవిచంద్ర వ్యాఖ్యలు
పాండిచ్చేరిలోని కారైకల్.. తమిళనాడు బోట్లకు సంబంధమేమిటంటూ బీద రవిచంద్ర మాట్లాడారని విమర్శించారు. అక్కడ్నుంచి తమిళనాడు బోట్లను నడపొచ్చా, లేదాననే విషయం నెట్‌లో కొడితే తెలిసిపోతుందన్నారు. కారైకల్ ఫిషింగ్ హార్బర్ ద్వారా తమిళనాడు బోట్లు ఆపరేటవుతుంటాయని, వాస్తవాలను దాచిపెట్టి వక్రీకరించేలా కూటమి నేతలు యత్నిస్తున్నారనే విషయం ఈ ప్రెస్‌మీట్ ద్వారా అర్థమైందని చెప్పారు. మత్స్యకారులపై మాట్లాడే హక్కు మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, తమ పార్టీ నేతలకే ఉందని తెలిపారు.
ఆదేశాలిచ్చింది వాస్తవం కాదా..?
నెల్లూరుకు మంత్రి కొల్లు రవీంద్ర వచ్చి బోట్లు విడుదల చేయాలంటూ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చిన మాట వాస్తవం కాదానని ప్రశ్నించారు. రిటైర్డ్ అధికారిని తీసుకొచ్చి వీటిని ఏ విధంగా తరలించాలో ప్రణాళికలను రచించిన విషయం నిజం కాదానని నిలదీశారు. ఈ ఉదంతంలో సీఐను మాత్రమే సస్పెండ్ చేసి మిగిలిన వారిని వదిలేశారని ధ్వజమెత్తారు. చిత్తశుద్ధి ఉంటే పాండిచ్చేరిలో ఉన్న బోట్లను తీసుకొచ్చి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు.
మాటలు నీటిమూటలేనా..?
గస్తీ బోటొస్తుందని, ఇతర రాష్ట్రాలకు చెందిన వారెవర్నీ రానీయమంటూ కలెక్టర్ ఇటీవల చెప్పారని, అయితే వాకాడు సమీపంలోని శ్రీనివాసపురం తీరానికి వేరే రాష్ట్రం నుంచి బోట్ వచ్చి 100 మీటర్ల దూరంలో వేటాడి, మన మత్స్య సంపదను ఈ నెల 27న దోచుకుపోయింని ఆరోపించారు. దీనికి జిల్లా మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సాగర్ డిఫెన్స్ అనే ప్రైవేట్ సంస్థకు మత్స్యకారులకు సంబంధించిన స్థలాలివ్వడం, హార్బర్‌లో కొంత భాగాన్ని కేటాయించడం పెద్ద తప్పన్నారు. పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని, ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకే వ్యతిరేకమని చెప్పారు. జువ్వలదిన్నెకు జగన్‌మోహన్‌రెడ్డి రావాల్సి ఉందని, అయితే వరుసగా పండగలు రావడంతో ముందస్తు ఏర్పాట్లు చేసేందుకు కొంత అంతరాయం ఏర్పడిందన్నారు. ఏప్రిల్ రెండో వారం లేదా ఆ తర్వాత వచ్చి మత్స్యకారుల సమస్యలను తెలుసుకొని, వారికి అండగా నిలుస్తారని చెప్పారు.
టీడీపీ నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదం
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ఎవరు నిర్మించారో జిల్లా ప్రజలు, మత్స్యకార కుటుంబాలకు తెలుసునని చెప్పారు. తట్టెడు మట్టి, ఒక్క రాయి పెట్టి కట్టకుండానే తామే నిర్మించామంటూ టీడీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. మత్స్యకారుల సంక్షేమం కోసం గత ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలను అమలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. జగన్‌మోహన్‌రెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కూటమి నేతలకు కనిపించడంలేదానని ప్రశ్నించారు. నేలటూరులో ఫిషింగ్ జెట్టి నిర్మాణాన్ని ప్రారంభించారని, దీనికి ఎంత అవసరమైనా అదానీ కృష్ణపట్నం పోర్టు భరించి పూర్తి చేయాలని చెప్పారన్నారు. అయితే ప్రస్తుతం సోమిరెడ్డికి కమీషన్లు రాకపోవడంతో వీటిని అర్ధాంతంగా నిలిపేయించారని ధ్వజమెత్తారు. ప్రతి పనికీ వసూలు చేస్తూ అవినీతి సొమ్మును జేబులో వేసుకుంటున్నారని మండిపడ్డారు.


