● మంగళంపాడు గిరిజనకాలనీలో విషాదం
వెంకటాచలం: గ్రావెల్ గుంతలో ప్రమాదవశాత్తూ జారిపడి ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందిన విషాద ఘటన మండలంలోని తిక్కవరప్పాడు పంచాయతీ పరిధిలో గల మంగళంపాడు గిరిజనకాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. బాలిక కుటుంబసభ్యుల వివరాల మేరకు.. వ్యవసాయ పనులకు మానికల గజేంద్ర వెళ్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈయన చిన్న కుమార్తె సాత్విక స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. తోటి బాలికలతో కలిసి గిరిజన కాలనీని ఆనుకొని ఉన్న కోనచెరువు వద్దకెళ్లింది. చెరువులో గ్రావెల్ తవ్విన గుంతలో ప్రమాదవశాత్తూ జారిపడిపోవడంతో, మిగిలిన చిన్నారులు అక్కడ్నుంచి భయంతో గిరిజన కాలనీకి పరుగులు తీశారు. కొద్దిసేపటికి విషయాన్ని అక్కడి వారికి చెప్పడంతో, అందరూ కలిసి 108కు సమాచారమిచ్చారు. గ్రావెల్ గుంత వద్దకెళ్లి సాత్వికను బయటకు తీశారు. సిబ్బంది అక్కడికి చేరుకొని పరీక్షించగా, అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను గ్రావెల్ గుంత బలితీసుకోవడంతో తల్లిదండ్రులు గజేంద్ర, శ్రావణి గుండెలవిసేలా రోదించారు.


