అవినీతి అధికారికే
అందలం
● ఆయన్ను సరెండర్ చేసే అధికారం నెల్లూరు సెంట్రల్ డివిజన్ ఈఈకి లేదంటూ స్పష్టీకరణ
● అక్కడే నియమిస్తూ ఆర్థిక (పనుల ఖాతాలు) శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు
● చక్రం తిప్పిన సర్వేపల్లి ముఖ్య నేత
● ఇరిగేషన్ శాఖలో అవినీతి
పారుదలకు లైన్ క్లియర్
ఇరిగేషన్ శాఖలోని నెల్లూరు సెంట్రల్ డివిజన్లో అవినీతి ముద్ర పడిన అధికారిని టచ్ చేస్తే.. స్థానిక అధికారులకు మడతైపోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సర్వేపల్లి ముఖ్యనేత అండతో డిప్యుటేషన్‌పై డీఏఓ (డబ్ల్యూ) గ్రేడ్–1గా పాగా వేసిన ఓ అధికారి అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. వరదల పనుల బిల్లుల్లో కమీషన్లు దండుకున్నాడు. అసలు పనులే చేయకుండా.. ఒకే పనికి మూడు పథకాల పేరుతో రూ.కోట్లు దోచుకున్నారు. కాంట్రాక్టర్ల నుంచి ఫోన్‌పే ద్వారా లంచాలు తీసుకుంటూ.. ఫైళ్లలో సంతకాలు చేస్తుండటంతో అదే శాఖలోని అధికారులే విచారణకు సిఫార్సు చేస్తే, రాజకీయ అండతో దీన్ని తొక్కి పెట్టించారు. సరెండర్ చేస్తే.. రెండు నెలలు తిరగకుండానే తిరిగి అదే సీటులో కూర్చొనే స్థాయిలో చక్రం తిప్పడం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికారం అండతో అవినీతిలో కూరుకుపోయిన అధికార్నే అదే స్థానంలో అందలం ఎక్కిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక (పనుల ఖాతాలు) శాఖ డైరెక్టర్ ఉత్తర్వులిచ్చారు. ఆయన్ను ఇక్కడి నుంచి సరెండర్ చేసే అధికారం స్థానిక అధికారికి లేదంటూ ఉత్తర్వుల్లోనే ఉటంకించడం చూస్తే.. ఏ స్థాయిలో చక్రం తిప్పారో అర్థమవుతోంది. రెండు నెలల్లోనే తిరిగి అదే స్థానంలోకి రావడానికి ఆర్థిక (పనుల ఖాతాలు) శాఖలోని కీలక అధికారులకు భారీగానే ముడుపులు అందించారనే ఆరోపణలు లేకపోలేదు. ఇరిగేషన్ శాఖలో నెల్లూరు సెంట్రల్ డివిజనల్ అకౌంటెంట్ అధికారిగా పని చేసే వ్యక్తి గత ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడడంతో ఆయన్ను ఇక్కడి నుంచి బదిలీ చేసింది. అయితే కూటమి ప్రభుత్వం రాగానే సదరు అధికారిని సర్వేపల్లి ముఖ్య నేత తన రాజకీయ పరపతితో రెగ్యులర్ బదిలీ కాకుండా.. డిప్యుటేషన్‌పై తిరిగి నియామకం చేయించారు. ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గంలో సాగునీటి కాలువలకు ఫ్లడ్ డ్యామేజ్ పనుల పేరుతో ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించుకుని పనులు చేయకుండానే బిల్లులు చేసుకుని వాటాలు పంచుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గతేడాది వచ్చిన మోంథా తుఫాన్ ధాటికి దెబ్బతిన్న సాగునీటి కాలువల మరమ్మతులకు కలెక్టర్ ప్రతిపాదనలు మేరకు రూ.93.27 కోట్ల నిధులను మంజూరు చేయగా సర్వేపల్లిలో 316 పనులను రూ.5 లక్షల లోపు పనులుగా విభజించి నామినేషన్ పద్ధతిలో కొన్ని, టెండర్ ప్రక్రియలో తన అనుచరులకే పనులు దక్కేలా చక్రం తిప్పారు. ఇందుకు సదరు డీఏఓ సంపూర్ణ సహాయ సహకారం అందించినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో పనులు చేయకుండానే నిధులు స్వాహా చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో సదరు డివిజనల్ అకౌంటెంట్ అధికారి కాంట్రాక్టర్ల నుంచి తనతోపాటు, తన తనయుడు, సమీప బంధువుల ఫోన్‌పేలకు లంచాలు బదిలీ చేయించుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలతో సహా బయటకు వచ్చాయి.
సీఎంఓకు ఫిర్యాదులు చేసినా..
నెల్లూరు ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై అదే శాఖలోని ఓ అధికారి ముఖ్యమంత్రి కార్యాలయానికి గతేడాది అక్టోబర్ 26న లేఖ రాశారు. ఆ శాఖ ఈఎన్‌సీతోపాటు ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, కలెక్టర్‌కు ఆ లేఖ ప్రతులు పంపారు. సుమారు రూ.100 కోట్లకు పైగా అవినీతి జరిగిందని, గతంలో చేసిన పనులను ఎఫ్‌డీఆర్ (ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్లు), ఉపాధి హామీ, డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్స్, ఓఎంఎంలో బిల్లులు చేయించుకున్నారని, మోంథా తుపాన్ పనులు పూర్తిస్థాయిలో అవినీతి చోటు చేసుకుందని, ఆయా అక్రమాల్లో తమ శాఖ ఎస్‌ఈ ప్రమేయం ఉందంటూ ఫిర్యాదు చేయడంతో స్పందించిన సీఎంఓ విచారణకు ఓ ప్రత్యేకాధికారిని నియమించింది. అయితే తీగ లాగితే డొంక కదులుతుండడంతో ఓ సీనియర్ ఎమ్మెల్యే విచారణ అధికారిని మేనేజ్ చేసి నివేదికను తొక్కిపెట్టించారనే ఆరోపణలున్నాయి. విచారణలో జాప్యం అవుతుండడంతో ఆ ఫిర్యాదుపై శాఖ పరమైన నివేదిక ఇవ్వాలని నెల్లూరు సెంట్రల్ డివిజన్ ఎస్‌ఈ, ఈఈలకు ఆదేశాలొచ్చాయి.
సరెండర్ చేసిన
రెండు నెలల్లోనే..
సదరు డీఏఓ అవినీతిపై సీఎంఓ నుంచి విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ‘ఫోన్‌పేలో లంచం.. ఫైళ్లలో సంతకం’ ఇరిగేషన్‌లో అవినీతి జలగలనే శీర్షికతో ఈ ఏడాది జనవరి 2వ తేదీన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన నెల్లూరు ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అదే నెల 9న సంబంధిత శాఖలను పొందుపరిచి ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అయితే సర్వేపల్లి ముఖ్య నేత అండదండలతో చక్రం తిప్పడంతో సదరు డీఏఓను యథాస్థానంలో నియమిస్తూ రాష్ట్ర ఆర్థిక (పనుల ఖాతాలు) శాఖ డైరెక్టర్ బోగిరి ప్రేమకుమారి మంగళవారం జారీ చేసిన ఉత్తర్వులు బుధవారం ఇరిగేషన్ నెల్లూరు సెంట్రల్ డివిజన్ కార్యాలయానికి అందాయి. ఇదిలా ఉండగా సదరు డీఏఓను బదిలీ/సరెండర్ చేసే అధికారం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కు లేదంటూ పేర్కొనడం చూస్తే.. ఇకపై ఆయన్ను ఇక్కడి నుంచి కదిలించొద్దని చెప్పకనే చెప్పినట్లుగా ఉందని ఆ శాఖలోని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. సీఎంఓ విచారణ ఆదేశాలను తొక్కిపెట్టడం.. సరెండర్‌ను రద్దు చేయించడం డీఏఓకు సాధ్యపడేది కాదని, సర్వేపల్లి ముఖ్యనేతనే ఈ స్థాయిలో చక్రం తిప్పారనే ప్రచారం జరుగుతోంది. సదరు అధికారిని అడ్డం పెట్టుకుని సర్వేపల్లిలో రూ.కోట్ల దోపిడీకి లైన్ క్లియర్ అయిందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.


