నెల్లూరు(అర్బన్): దర్గామిట్టలోని ఎల్‌ఐసీ డివిజన్ కార్యాలయం నుంచి కిమ్స్ ఆస్పత్రి, కేవీఆర్ పెట్రోల్ బంకు, ఆర్టీసీ మీదుగా తిరిగి సంస్థ కార్యాలయం వరకు ఎల్‌ఐసీ సిటీ బ్రాంచ్ 1, 2, సీఏబీ బ్రాంచ్ ఉద్యోగులు, డెవలప్‌మెంట్ ఆఫీసర్లు, పలువురు ఏజెంట్లు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ బి.ప్రసాద్‌రావు మాట్లాడుతూ బీమా రంగంలో ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ మాత్రమేనన్నారు. ఎల్‌ఐసీ సాధారణ ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఎన్నో రకాల పాలసీలను ప్రవేశపెట్టిందన్నారు. నవజీవన్‌శ్రీ సింగిల్ ప్రీమియం పాలసీకి ప్రజల నుంచి పెద్దఎత్తున ఆదరణ వస్తోందన్నారు. ఒక్కసారి ప్రీమియం చెల్లించి 5, 10, 15, 20 సంవత్సరాలపాటు టర్మ్ తీసుకునే సదుపాయం ఇందులో ఉందన్నారు. రాబడి, రిస్క్ కవర్, గ్యారెంటీ అడిషన్స్ కలిపిన పాలసీ ఈనెల 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ రామకృష్ణ, ఉద్యోగులు పాల్గొన్నారు.


