మత్స్యకారుల భవిష్యత్తు ప్రశ్నార్థకం | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారుల భవిష్యత్తు ప్రశ్నార్థకం

Mar 26 2026 7:24 AM | Updated on Mar 26 2026 7:24 AM

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీకి మత్స్యకారులంటే మొదట్నుంచీ చులకనేనని, గతంలో అధికారంలో ఉన్న సమయంలోనూ వీరి సంక్షేమానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి దుయ్యబట్టారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. మత్స్యకారులపై అనేక అన్యాయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కలెక్టర్‌ కార్యాలయంలో సమావేశాన్ని కూటమి నేతలు తూతూమంత్రంగా నిర్వహించి వెళ్లిపోయారని విమర్శించారు.

ప్రభుత్వ ఆదేశాలతోనే

మిన్నకుండిపోయారు..

తమిళనాడు, పుదుచ్చేరి బోట్లను ప్రాణాలకు తెగించి మత్స్యకారులు పట్టిస్తే, రెండు ఎఫ్‌ఐఆర్‌లను పోలీసులు నమోదు చేసి ప్రభుత్వ ఆదేశాలతో మిన్నకుండిపోయారని విమర్శించారు. పట్టుకున్న నాలుగు బోట్లను ముందస్తు పథకం ప్రకారమే అధికారులు విడిచిపెట్టారని ఆరోపించారు. జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ ప్రైవేటీకరణను ఆపడంతో పాటు అపహరించిన బోట్లను యథాస్థానంలో ఉంచాలని డిమాండ్‌ చేశారు. మత్స్యకారులకు తమ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. తమిళనాడు, పుదుచ్చేరి జాలర్లు మన జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి 500 మీటర్లలోపే వేట సాగిస్తూ.. ఇక్కడి వారి వలలను తెంపి మత్స్య సంపదను కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. పోలీసుల రక్షణలో బోట్లు భద్రంగా ఉంటాయని మత్స్యకారులు నమ్మి నిశ్చింతగా ఉన్నారని, అయితే ఇవి అర్ధరాత్రి అక్రమంగా తరలివెళ్లిపోవడంతో వారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారన్నారు.

మొక్కుబడి సమీక్షలెందుకు..?

మత్స్యకారులను నమ్మించి గొంతు కోశారని, ఘటనకు ప్రభుత్వ పెద్దలే కారణం కావడంతో, తప్పును పోలీసులపై నెట్టేసి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. కలెక్టరేట్లో ప్రభుత్వ పెద్దలు, అధికారులు నిర్వహించిన సమావేశంలో.. బోట్లు అక్రమంగా తరలివెళ్లడంపై సమీక్షించకుండా.. సంబంధిత బాధ్యులపై ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ధారించకుండా, రాజకీయ ప్రసంగాలతో ముగించారని విమర్శించారు. పుదుచ్చేరి, తమిళనాడులోని వ్యక్తులకు ఎవరు సహకరించారు.. బోట్ల అపహరణకు కారణాలేమిటో తెలపాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ పెద్దలే కుట్రధారులు

చంద్రబాబు, లోకేశ్‌ జోక్యంతో ఈ కుట్రలో స్థానిక టీడీపీ నేతలున్నారని ఆరోపించారు. కొందరి పేర్లను మత్స్యకార పెద్దలు చెప్పారని, వీరిని విచారించి కాల్‌ డేటా, బ్యాంక్‌ అకౌంట్‌ లావాదేవీలను పరిశీలిస్తే కుట్ర కోణాలు బయటపడతాయని చెప్పారు. ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే పోలీసులు వ్యవహరించారని, ఈ కారణంతోనే వారిపై చర్యలు చేపట్టలేకపోతున్నారని తెలిపారు. మత్స్యకారులను ప్రలోభపెట్టి వారిలో వారికి గొడవలు సృష్టించి.. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చుపెట్టేందకు యత్నిస్తున్నారని మండిపడ్డారు.

అండగా ఉంటాం

బోట్లు, ఫిషింగ్‌ హార్బర్‌ విషయంలో మత్స్యకారులకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వీరికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని భరోసా కల్పించేందుకు నెల్లూరు వచ్చేందుకు తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచిస్తున్నారని వెల్లడించారు. వీరి సమస్యలపై పోరాడతామని ప్రకటించారు. మత్స్యకారులకు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ఆస్తి ఫిషింగ్‌ హార్బర్‌ను వారికి విడిచిపెట్టి, డిఫెన్స్‌ కార్యకలాపాలకు మరో ప్రాంతాన్ని కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

మంత్రుల మాటలు ఫుల్‌.. చేతలు నిల్‌

ప్రాణాలకు తెగించి బోట్లను తెస్తే, సీజ్‌ చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు

ఖాకీల సంరక్షణలో ఉన్న వాటిని

ఎలా విడిపిస్తారు..?

ప్రభుత్వ పెద్దల జోక్యంతోనే

ఇదంతా జరిగింది

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement