కబ్జా కోరల్లో పాతూరు చెరువు | - | Sakshi
Sakshi News home page

కబ్జా కోరల్లో పాతూరు చెరువు

Mar 26 2026 7:24 AM | Updated on Mar 26 2026 7:24 AM

వింజమూరు(ఉదయగిరి):వింజమూరులోని పాతూరు చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుంది. పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో ఇళ్ల స్థలాల ధరలకు రెక్కలొచ్చాయి. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు కోట్లాది రూపాయల విలువ జేసే చెరువు స్థలాన్ని దర్జాగా ఆక్రమించి ఇళ్లు నిర్మించుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారంలో కొందరు మీడియేటర్లు పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకొని ఇరిగేషన్‌ అధికారులను మేనేజ్‌ చేశారనే ఆరోపణలూ ఉన్నాయి. ప్రస్తుతం చెరువులో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అయినా ఇరిగేషన్‌ అధికారులు ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

15 ఎకరాల వరకు ఆక్రమణ

పాతూరు చెరువు విస్తీర్ణం అధికారిక లెక్కల ప్రకారం 287 ఎకరాలుండగా, అందులో సుమారు 15 ఎకరాల వరకు కబ్జాకు గురయ్యాయని ఇరిగేషన్‌ అధికారులే చెప్తున్నారు. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం కబ్జాకు గురైన స్థల విలువ రూ.పది కోట్లకు పైమాటే.

ఆక్రమణల తొలగింపుపై

దృష్టి సారించని అధికారులు

పాతూరు ఇరిగేషన్‌ చెరువును సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌గా మార్చి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చాలనే డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. వచ్చే నెల 1న వింజమూరుకు సీఎం రానున్నారు. ఈ నేపథ్యంలో పాతూరు చెరువును సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌గా మార్చేందుకు అవసరమైన నిధులు రాబట్టే యత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో చెరువులోని చెట్లు తొలగించి, గుంతలు పూడ్చి కట్టను శుభ్రం చేస్తున్నారు. అంతేకాకుండా డ్వామా అధ్వర్యంలో బంగ్లా సెంటర్‌ నుంచి ఇరిగేషన్‌ కార్యాలయం వరకు వాకింగ్‌ ట్రాక్‌, పార్కు పనులు చేపడుతున్నారు. ఇందుకోసం రూ.50 లక్షలు ఖర్చు చేస్తున్నారు. కానీ ఇరిగేషన్‌ అధికారులు ఆక్రమణల తొలగింపు దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇరిగేషన్‌ కార్యాలయం నుంచి బాలికల వసతి గృహం వరకు రూ.కోట్ల విలువైన సుమారు 500 అంకణాల చెరువు స్థలంలో ఆక్రమణలున్నాయి. వీటిని తొలగించి పార్కు, వాకింగ్‌ ట్రాక్‌ పనులు చేపడితే పట్టణ వ్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు ఆ దిశగా ఎందుకు ఆలోచన చేయడం లేదో అంతు పట్టడం లేదు. ఇప్పుడు ఆక్రమణలను తొలగించకపోతే భవిష్యత్తులోనూ ఇలానే కొనసాగే అవకాశం ఉంది.

ఆక్రమణదారులకు గతంలో నోటీసులు

చెరువు పైభాగంలో సుమారు ఐదెకరాల వరకు ఆక్రమించి కొందరు పంటలను సాగుచేస్తున్నారు. అలాగే పట్టణ సమీపంలో సుమారు 50 మందికిపైగా చెరువును ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారు. భారీ వర్షాలు పడి చెరువు నిండితే దాదాపు ఇళ్లు మునిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా ఆక్రమణదారులకు నోటీసులను సైతం ఇరిగేషన్‌ అధికారులు గతంలో ఇచ్చారు. ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో గానీ ఆక్రమణల తొలగింపు దిశగా ఎలాంటి అడుగులు ముందుకు పడలేదు. ప్రస్తుతం చెరువుల అభివృద్ధి పనులను చేపడుతున్న నేపథ్యంలో ఇరిగేషన్‌ అధికారులు చొరవ చూపి ఆక్రమణలను తొలగించి హద్దులను ఏర్పాటు చేసి చుట్టూ కట్టను నిర్మిస్తే భవిష్యత్తులో ఇవి జరిగే అవకాశం ఉండదు. ఈ విషయమై స్థానిక ఇరిగేషన్‌ అధికారులు మాట్లాడుతూ.. ఆక్రమణల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని.. కలెక్టర్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఈలు తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని బదులిచ్చారు.

రూ.కోట్ల విలువజేసే

చెరువు స్థలం ఆక్రమణ

దర్జాగా గృహ నిర్మాణాలు

కొన్నేళ్లుగా యథేచ్ఛగా

సాగుతున్న పర్వం

అయినా పట్టించుకోని

ఇరిగేషన్‌ అధికారులు

ప్రస్తుతం అభివృద్ధి పనులు చేపడుతున్నా తొలగించకపోవడంపై విమర్శలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement