● కోవూరులో పేదల ఇళ్ల కూల్చివేత
● బాధితుల ఆక్రందన
కోవూరు: కూటమి నేతల అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. మండలంలోని పడుగుపాడు నేతాజీనగర్‌లో దశాబ్దాలుగా తలదాచుకుంటున్న నిరుపేద కుటుంబాలపై ప్రభుత్వం కక్షగట్టింది. ముందస్తు నోటీసుల్లేకుండా.. ప్రత్యామ్నాయం చూపకుండా 15 ఇళ్లను జేసీబీలతో బుధవారం కూల్చేశారు. వివరాలు.. పడుగుపాడు పంచాయతీ సబ్‌స్టేషన్ సమీపంలో రోడ్డు పక్కన సుమారు 50 ఏళ్లుగా నిరుపేదలు నివాసముంటున్నారు. వీరిని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం రోడ్డున పడేసింది. జేసీబీలను అధికారులు తీసుకొచ్చి ఇళ్లను కూల్చేశారు. దీంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఏళ్ల తరబడి నివాసముంటున్న తమకు పట్టాలిచ్చి ఆదుకోవాల్సింది పోయి.. రాత్రికి రాత్రే ఖాళీ చేయాలంటూ బెదిరించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిరసన
ఇళ్ల కూల్చివేతపై బాధిత మహిళలు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే తీరును తప్పుబట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే తమ ఇళ్లను తొలగించారని ఆరోపించారు. గత ప్రభుత్వం తమకు అండగా ఉందని, అయితే ప్రస్తుత సర్కార్ గూడు లేకుండా చేసిందని వాపోయారు. చావడానికై నా సిద్ధమే గానీ ఇళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఇక్కడ్నుంచి ఒక్క ఇటుకను సైతం కదలనీయమని చెప్పారు. ఇంటికి నాలుగుసార్లు వస్తే కనీసం పలకరించి సమస్యలు వినే స్థితిలో ఎమ్మెల్యే లేరని ఆరోపించారు. గత సీఎం జగనన్న హయాంలో తమను ఎంతో ఆదుకున్నారని గుర్తుచేశారు. ప్రజాప్రతినిధులు కక్షసాధింపు చర్యలను మాని సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.


