కామాక్షితాయి హుండీ కానుకల లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

కామాక్షితాయి హుండీ కానుకల లెక్కింపు

Mar 26 2026 7:24 AM | Updated on Mar 26 2026 7:24 AM

రూ.55 లక్షల ఆదాయం

బుచ్చిరెడ్డిపాళెం రూరల్‌: మండలంలోని జొన్నవాడలో ఉన్న మల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయంలో హుండీ కానుకల లెక్కింపు బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఈఓ అర్వభూమి వెంకట శ్రీనివాసులురెడ్డి మాట్లాడారు. గత సంవత్సరం డిసెంబర్‌ 3 నుంచి ఈ సంవత్సరం మార్చి 24వ తేదీ వరకు 112 రోజులకు గానూ ప్రధాన హుండీల ద్వారా రూ.55,60,482ల నగదు వచ్చిందన్నారు. యూఎస్‌ఏ డాలర్లు 11, యూఏఈ థిర్హామ్స్‌ 10, కువైట్‌ దినార్స్‌ 2, బంగారు వస్తువులు 44 గ్రాములు, వెండి వస్తువులు 248 గ్రాముల్ని భక్తులు సమర్పించారని వివరించారు. కార్యక్రమంలో జిల్లా దేవదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పాలిసెట్‌కు ఉచిత శిక్షణ

నెల్లూరు(టౌన్‌): పాలిటెక్నిక్‌లో ప్రవేశాల కోసం జరిగే పాలిసెట్‌ ప్రవేశపరీక్షకు సంబంధించి నెల్లూరు దర్గామిట్టలోని మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో బాలికలకు ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్‌ ఏసుదాసు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ ఏప్రిల్‌ 22 వరకు ఇస్తామన్నారు. రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తరగతులు జరుగుతాయని, వివరాలకు 99123 42048 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని తెలియజేశారు.

ధాన్యం సేకరణకు సహకరించాలి

నెల్లూరు (దర్గామిట్ట): ధాన్యం సేకరణకు మిల్లర్లు సహకరించాలని రాష్ట్ర పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. జిల్లాలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు, దానికి సంబంధించిన సమస్యలపై అమరావతి నుంచి మనోహర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఢిల్లీరావు బుధవారం జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మంత్రి మాట్లాడు తూ వైఎస్సార్‌ కడప, అన్నమయ్య జిల్లాల నుంచి మిల్లులను నెల్లూరు జిల్లాకు అనుసంధానం చేసి ఇక్కడ ధాన్యాన్ని తీసుకెళ్లే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

పోస్టాఫీసుల్లో

పార్సిల్‌ సౌకర్యం

నెల్లూరురూరల్‌: నెల్లూరు పోస్టల్‌ డివిజన్లో పలు పోస్టాఫీసుల్లో నాణ్యమైన ప్యాకింగ్‌తో పార్సిల్‌ సౌకర్యం అతి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉందని జిల్లా పోస్టల్‌ సూపరిండెంటెంట్‌ కె.శ్రీనివాస్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వర్క్‌షాపు, తరగతి గదుల నిర్మాణానికి భూమిపూజ

నెల్లూరు(టౌన్‌): వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలికల ఐటీఐలో జీఆర్‌ఎన్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అధినేత గంటా రమణయ్య నాయుడు సొంత నిధులతో వర్క్‌షాపు, తరగతి గదుల నిర్మాణం కోసం బుధవారం భూమిపూజ నిర్వహించారు. రమణయ్య దంపతులను ఐటీఐ ప్రిన్సిపల్‌ ఏడుకొండలు సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

ఆవును ఆటోకు

కట్టి తరలింపు

మందలించిన ఇన్‌స్పెక్టర్‌

నెల్లూరు సిటీ: ఆవును తాడుతో ఆటోకు కట్టి తరలించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవు యజమానిని ఇన్‌స్పెక్టర్‌ మందలించడంతో మరో వాహనంలో ఎక్కించుకెళ్లారు. స్థానికుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్‌ మండలం డైకస్‌రోడ్డు నుంచి పొదలకూరు రోడ్డు మీదుగా బుధవారం ఓ వ్యక్తి తన ఆవును తాడుతో ఆటోకి కట్టి వేగంగా తీసుకెళ్తున్నాడు. అటుగా వెళ్తున్న వారు గమనించి ఆవు యజమానిని నిలదీశారు. ఇలా హింసించడం సరికాదన్నారు. నా ఆవును ఎలాగైనా తీసుకెళ్తానని యజమాని చెప్పడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈక్రమంలో అటుగా వెళ్తున్న చిన్నబజారు ఇన్‌స్పెక్టర్‌ చిట్టెం కోటేశ్వరరావు ఈ విషయాన్ని గమనించి ఆవు యజమానిని మందలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement