● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ
నెల్లూరు(బృందావనం): రాష్ట్రంలో దళితులు, క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆలిండియా వ్యవస్థాపకుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆరోపించారు. నెల్లూరు పురమందిరం ప్రాంగణంలోని వర్థమాన సమాజం సమావేశ మందిరంలో అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మున్నెన్నడూ లేని విధంగా దళితులపై హత్యలు, లైంగిక దాడులు పెరిగిపోయాయన్నారు. అయినా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ కోసం ఇప్పటికే ఉన్న కోర్టులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టులుగా మార్చి నిందితులకు తక్షణమే శిక్షలుపడేలా చూడాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో జూలై 7న మాదిగల పుణ్యక్షేత్రం శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు బెల్లంకొండ గోపి, కె.రమేష్; మధు, వివేక్, పెంచలయ్య, సుధాకర్, చంటి తదితరులు పాల్గొన్నారు.


