నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయాలని అధికారులు నిర్ణయించారు. నెల్లూరు కలెక్టరేట్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ ఆన్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సమావేశం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల, అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డ్రగ్స్ నియంత్రణ కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అన్ని శాఖల సమన్వయంతో కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించారు. సరఫరా, డిమాండ్ తగ్గింపు, అవగాహన, పునరావాసం అనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. డ్రగ్స్ సరఫరా గొలుసును పూర్తిగా గుర్తించి ధ్వంసం చేసే దిశగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద వాహనాల తనిఖీలు కట్టుదిట్టం చేయడం, అనుమానాస్పద ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించడం, అటవీ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రోడ్లు, రైల్వేలు, సముద్ర మార్గాల్లో తనిఖీలను తప్పనిసరి చేస్తామన్నారు. అంతర్రాష్ట స్మగ్లింగ్‌పై ముఖ్యంగా విశాఖపట్నం మార్గాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నామన్నారు. అదేవిధంగా ఎన్‌డీపీఎస్ చట్టం కింద నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడం, డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పూర్తిగా విచ్ఛిన్నం చేయడం, విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలను విస్తరించడం, స్థానిక మీడియా ద్వారా ప్రచారాన్ని పెంపొందించడం వంటి అంశాలపై చర్చించారు. సమావేశంలో జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుజాత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


