● డీఎంహెచ్‌ఓ సుజాత
నెల్లూరు(అర్బన్): హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించి వారిని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచాలని డీఎంహెచ్‌ఓ సుజాత ఆదేశించారు. బుధవారం మాతాశిశు మరణాల సబ్ కమిటీ సమావేశం నెల్లూరు సంతపేటలోని వైద్యశాఖ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం జనవరి నుంచి ప్రస్తుత మార్చి నెల వరకు ఒక మాతృ, ఏడుగురు శిశువులు మరణించారని ఇందుకు గల కారణాలు తెలపాలని కోరారు. ఏఎన్‌ఎం నిర్లక్ష్యం వల్ల మరణాలు సంభవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళ గర్భం దాల్చిన విషయాన్ని గుర్తించి రిజిస్టర్‌లో ఆమె వివరాలను నమోదు చేసుకుని ప్రతినెలా ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు. రక్తహీనత ఉందా?, బీపీ ఉందా అని పరీక్షించాలన్నారు. ఆస్పత్రిలో సుఖ ప్రసవం జరిగే వరకు ఏఎన్‌ఎంతోపాటు డాక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పుట్టిన పిల్లలకు తక్షణమే పురిటిపాలు ఇప్పించాలని సూచించారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ టీకాలు షెడ్యూల్ ప్రకారం వేయించాలని ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులు జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి డాక్టర్ పరిమళ, డీఐఓ డా.ఉమామహేశ్వరి, గైనకాలజీ డాక్టర్ మేరీస్నిగ్ధ, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ శోభారాణి, జీజీహెచ్ అనస్థీషియా హెచ్‌ఓడీ డాక్టర్ శ్రీనివాసరావు, డా.గ్రేస్ ప్రియాంక, బ్లడ్ బ్యాంక్ ఇన్‌చార్జి డాక్టర్ అనిత తదితరులు పాల్గొన్నారు.


