కావలి: తల్లీకుమారుడిపై కత్తితో దాడిచేసిన ఘటన మంగళవారం అర్ధరాత్రి జలదంకి మండలం చామదాలలో జరిగింది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. గతేడాది వినాయకచవితి సమయంలో పందిటి పోలమ్మ, ఆమె కుమారుడిపై అదే గ్రామానికి చెందిన పందిటి పోలయ్య, హరికృష్ణ దాడి చేశారు. ఈ విషయమై అప్పట్లో జలదంకి పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మంగళవారం వారి మధ్య మాటామాటా పెరిగింది. పలువురు సర్దుబాటు చేయడంతో ఇళ్లకు వెళ్లిపోయారు. పోలయ్య, హరికృష్ణ, అమ్ములు అర్ధరాత్రి మారణాయుధాలతో తమపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారని పోలమ్మ, ఆమె కుమారుడు తెలిపారు. స్థానికులు 108కి సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ సిబ్బంది వచ్చి వారిని కావలి ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. బాధితులు మాట్లాడుతూ గతంలో దాడి జరిగినప్పుడే పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఈ విషయమై బుధవారం జలదంకి ఎస్సై లతీఫున్నీసా మాట్లాడుతూ రెండు వర్గాల మధ్య కొంతకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. కొద్దిరోజుల క్రితం నిందితులుగా ఉన్నవారిపై బాధితులు ఫిర్యాదు చేశారన్నారు. హరి, పోలయ్య, అమ్ములుపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు.


