నెల్లూరు సిటీ: గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతిచెందిన ఘటన నెల్లూరులోని ప్రధాన బస్టాండ్‌లో మంగళవారం రాత్రి జరిగింది. అధికారుల కథనం మేరకు.. విజయవాడ డిపోకు చెందిన బస్సు తిరుపతికి ప్రయాణికులతో బయలుదేరింది. ఈ క్రమంలో నెల్లూరు బస్టాండ్‌కు చేరుకుంది. డ్రైవర్‌గా ఉన్న వ్యక్తి.. ఎంఎస్ రావు అనే రెండో డ్రైవర్‌ను పలుమార్లు పిలిచాడు. అయితే అతని నుంచి స్పందన లేకపోవడంతో వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి అప్పటికే ఎంఎస్ రావు మృతిచెందినట్లు నిర్ధారించారు. అతను గుండెపోటుతో చనిపోయినట్లు ప్రజా రవాణా అధికారిణి షమీమ్ తెలిపారు. బస్సులో ఉన్న ఏడుగురు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు డిపో 1 మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు.


