● వాటర్ ప్లాంట్ కూల్చివేతపై
కమిషనర్‌ను ప్రశ్నించిన కార్పొరేటర్
● సరైన సమాధానం ఇవ్వని నందన్
నెల్లూరు(బారకాసు): ప్రజల దాహార్తి తీర్చేందుకు 2019లో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా కూలుస్తారని నెల్లూరు 46వ డివిజన్ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ వేలూరు ఉమామహేష్ కమిషనర్ నందన్‌ను ప్రశ్నించారు. మంగళవారం కమిషనర్ ఆ డివిజన్‌లోని చిన్నబజార్ ప్రాంతంలో పర్యటించారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంగణంలో ఉన్న వాటర్ ప్లాంట్‌ను సోమవారం కార్పొరేషన్ అధికారులు దుర్మార్గంగా కూలదోసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కమిషనర్ ప్లాంట్‌ను అధికారులతో కలిసి పరిశీలించారు. అదే సమయంలో అక్కడికి కార్పొరేటర్ చేరుకుని కూల్చివేతపై కమిషనర్‌తో మాట్లాడారు. కానీ నందన్ మాత్రం ఉమామహేష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేదు. కార్పొరేషన్‌కు చెందిన స్థలం కాబట్టి అప్పట్లో వాటర్ ప్లాంట్ అవసరమని అనుమతి ఇచ్చాం.. ఇప్పుడు అవసరం లేదని, ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలని ప్లాంట్‌ను తొలగించాల్సి వచ్చిందని కమిషనర్ చెప్పారు. దీంతో ఉమామహేష్ అభివృద్ధి విషయంలో తాను సహకరిస్తానని అయితే కార్పొరేషన్ అనుమతితో సొంత నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను తొలగించాల్సి వస్తే కనీసం సమాచారం కూడా ఇవ్వరా అని ప్రశ్నించారు. జరిగిన నష్టాన్ని ఎవరు భరిస్తారని, అంతేకాకుండా తమ మనోభావాలు దెబ్బతీసేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదని ఇటువంటి చర్యలకు పాల్పడటం దుర్మార్గమన్నారు.


