● సీపీఐ జిల్లా కార్యదర్శి అంకయ్య
కావలి: అర్హులైన నిరుపేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం కేటాయించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య డిమాండ్ చేశారు. మంగళవారం కావలి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ ఎలీషాకు వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి వారు వినతిపత్రం అందజేశారు. అనంతరంం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ఇళ్ల నిర్మాణ వ్యయం పెరిగిందన్నారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వ సాయం అందించాలని కోరారు. దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్.మల్లి, యానాది సమాఖ్య అధ్యక్షురాలు బాపట్ల సత్యవతమ్మ మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల లబ్ధిదారులను బ్యాంకర్లు వేధిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం బకాయిలను మాఫీ చేయకుండా, ఇప్పుడు డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడం అన్యాయమన్నారు. సచివాలయాల్లో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న పేదలకు సరైన సమాధానం రావడం లేదన్నారు. అర్హత లేదంటూ కుంటిసాకులతో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తిరస్కరిస్తున్నారని చెప్పారు. ఆర్డీఓ ప్రత్యేక చొరవ తీసుకుని అర్హులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నాగరాజు, నాయకులు మాలకొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


