● రూ.వేలల్లో బిల్లులు
● చెల్లించాలంటూ సరఫరా నిలిపివేసిన ట్రాన్స్‌కో అధికారులు
● అల్లాడిపోతున్న
వృద్ధులు, చిన్నారులు
బిట్రగుంట: బోగోలు మేజర్ పంచాయతీలోని జగనన్న కాలనీల్లో నివసిస్తున్న పేద దళిత, గిరిజనులపై ట్రాన్స్‌కో అధికారులు అనుచితంగా వ్యవహరించారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, నోటీసులు కూడా ఇవ్వకుండా రూ.వేలల్లో బిల్లులు చెల్లించాలంటూ ఒక్కసారిగా మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో వృద్ధులు, చిన్నారులు చిమ్మచీకట్లో ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. అధికారుల దురుసు ప్రవర్తనపై దళిత సంఘాల నేతలు, స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. బాధితుల కథనం మేరకు.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు జగనన్న కాలనీల్లో పక్కాఇళ్లు నిర్మించి ఉచిత మీటర్లు బిగించి విద్యుత్ కనెక్షన్లు కూడా మంజూరు చేశారు. అక్కడ ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు నివాసముంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం కాలనీకి వచ్చిన అధికారులు ఒక్కొక్కరు రూ.వేలల్లో విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. అప్పటికప్పుడు బిల్లులు చెల్లించలేని సుమారు పదికి పైగా ఇళ్లకు కరెంట్ కట్ చేసి వెళ్లిపోయారు. కనీసం డిమాండ్ నోటీసు ఇచ్చి గడువు కూడా కేటాయించకుండా దుర్మార్గంగా వ్యవహరించడంతో ఆయా కుటుంబాల్లోని వృద్ధులు, పిల్లలు చీకట్లో ఇబ్బంది పడుతున్నారు. కాలనీలో విషసర్పాల బెదడ ఎక్కువగా ఉండటంతో చీకట్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు.
వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆగ్రహం
ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు కరెంట్ చేసిన విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు మద్దిబోయిన వీర రఘు, మేకల శ్రీనివాసులు తదితరులు కాలనీకి చేరుకుని బాధితులతో మాట్లాడారు. కనీస గడువు ఇవ్వకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై మండిపడ్డారు. అధికారుల అనుచిత వైఖరిపై ఎస్సీ, ఎస్టీ, మానవ హక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.


