కబళిస్తున్న క్షయ | - | Sakshi
Sakshi News home page

కబళిస్తున్న క్షయ

Mar 25 2026 7:00 AM | Updated on Mar 25 2026 7:00 AM

వ్యాధి సోకితే అనారోగ్యంతోపాటు ఆర్థికంగా తీవ్ర నష్టం

జిల్లాలో 15 వేల మందికి పైగా రోగులు

నెల్లూరు(అర్బన్‌): టీబీ (క్షయ) వ్యాధి గతంలో జిల్లాలో తగ్గుముఖం పట్టింది. కానీ చాపకింద నీరులా మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతోంది. మురికినీటి ఆవాసాలు, అపరిశుభ్రత ఉండే ప్రాంతాల్లో నివసించే వారు ఎక్కువగా టీబీ బారినపడుతున్నారు. ఇది అంటువ్యాధి. ఒకరినుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంది. ఇంట్లో పెద్దకు టీబీ సోకినప్పుడు ఆ వ్యక్తి సక్రమంగా వైద్య చికిత్స పొందినా కోలుకోవాలంటే 6 నెలలు నుంచి 9 నెలలు పడుతుంది. ఈలోపు ఆర్థికంగా, ఆరోగ్య పరంగా తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం మార్చి నెల 24వ తేదీని ప్రపంచ టీబీ నివారణ దినోత్సవంగా ప్రకటించింది. జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

ఇలా వస్తుంది

క్షయ (టీబీ) అనేది మైక్రో బ్యాక్టీరియం ట్యూబర్‌ క్లోసిస్‌ అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. ఎక్కువగా ఊపిరితిత్తులపై (లంగ్స్‌) దాడి చేస్తుంది. అంతే కాకుండా శరీరంలో ఎముకలు, చర్మం ఇలా ఏ భాగానికై న టీబీ రావొచ్చు. దగ్గు, తుమ్ములు, గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి అంటువ్యాధిగా వ్యాపిస్తుంది. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ గణాంకాల ప్రకారం జిల్లాలో 15 వేల మందికిపైగా టీబీ రోగులున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వైద్యశాలల్లో గుర్తించిన లెక్కలే ఎక్కువగా రికార్డు అవుతున్నాయి. తమకు టీబీ ఉన్నట్టు తెలిస్తే సమాజం చులకనగా చూస్తుందన్న భావన కొందరిలో ఉంది. దీంతో ప్రైవేట్‌ వైద్యశాలల్లో గుర్తించే కేసులు ఎక్కువ శాతం బయటకు పొక్కకుండా రోగులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలో టీబీ సోకిన వారిలో ఇమ్యూనిటీ తగ్గి ఇతర వ్యాధులు కూడా త్వరగా సోకి ప్రతి సంవత్సరం సుమారు 100 మంది వరకు మృత్యువాత పడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌తో బాధపడేవారు, పౌష్టికాహార లోపంతో బలహీనంగా ఉండే వారు, స్టెరాయిడ్స్‌ ఎక్కువగా వాడే వారు, మద్యం, ధూమపానం, షుగర్‌ ఉండే వారికి త్వరగా టీబీ సోకుతుంది.

ఇదీ పరిస్థితి

జిల్లాలో వైద్యశాఖ 2024లో 83,381 మందికి, 2025లో 1,08,711 మందికి టీబీ పరీక్షలు చేసింది. ఈ సంవత్సరం కొత్తగా 3,883 కేసులను గుర్తించారు. వీరితోపాటు టీబీ, హెచ్‌ఐవీ కలిగిన వారు 166 మంది, టీబీతోపాటు ఇతర ఊపిరితిత్తుల సమస్యలున్న వారు 542 మంది ఉన్నారు. ఇప్పటికే వైద్యశాఖ ద్వారా ట్రీట్‌మెంట్‌ పొందుతున్న టీబీ రోగులు, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో నమోదవుతున్న కేసులను కలిపితే 15 వేల మందికి పైగా వ్యాధి బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. టీబీ సోకిన వారు ఆరోగ్య పరిస్థితిని బట్టి 6 నెలల నుంచి 9 నెలల వరకు చికిత్స తీసుకోవాల్సి ఉంది. సక్రమంగా మందులు వాడకపోవడంతో మొండి టీబీగా (ఎండీఆర్‌టీ) మారిన కేసులు 196 ఉన్నాయి. వీరు రెండు నుంచి మూడేళ్లు చికిత్స పొందాల్సి ఉంది. జిల్లాలో 13 టీబీ యూనిట్స్‌ ఉన్నాయి. నెల్లూరులో ఒక టీబీ కేంద్రం ఉంది. రోగులను పరీక్షించేందుకు జిల్లా కేంద్రంలో ఒక సీబీ నాట్‌ జీన్‌ ఎక్స్‌పర్ట్‌ కేంద్రం ఉంది. 24 ఆర్టీపీసీఆర్‌ (ట్రూనాట్‌) మెషీన్లు, 92 గళ్ల పరీక్షా కేంద్రాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement