ఇసుక తవ్వకాలపై గతంలో ఫైర్‌ | - | Sakshi
Sakshi News home page

ఇసుక తవ్వకాలపై గతంలో ఫైర్‌

Mar 10 2026 7:12 AM | Updated on Mar 10 2026 7:12 AM

● నారాయణకు తలనొప్పిగా మారిన సొంత పార్టీ నేతలు

నెల్లూరు సిటీ నియోజకవర్గంలో షాడో మంత్రుల ఆధిపత్యం పెరిగింది. రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణకు సొంత పార్టీ నేతలే తలనొప్పిగా తయారయ్యారు. సాక్షాత్తు మంత్రే కార్యకర్తల టెలికాన్ఫరెన్స్‌లో తనకు చెడ్డపేరు తెచ్చేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇక్కడ ఏం జరుగుతున్నాయో తనకు అన్నీ తెలుసని చెప్పడంతో పార్టీ లో గ్రూప్‌ రాజకీయాలను ఆయన విస్పష్టం చేసినట్లు అయింది. మంత్రి నారాయణ కుటుంబ సభ్యులు, ఆయనకు అత్యంత సన్నిహితులతో పాటు ముఖ్యనేతలు సైతం గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు. మద్యం వ్యాపారాలు, ఇసుక తవ్వకాలు, కాంట్రాక్ట్‌ పనులు, నామినేటెడ్‌ పదవులు, ఉద్యోగుల బదిలీలు తదితర విషయాల్లో వీరి జోక్యం అధికం అయినట్లు మంత్రి మాటల్లోనే తెలుస్తోంది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు నగర ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నెలలో వారం రోజులకు మించి స్థానికంగా ఉండడం లేదు. నెల్లూరుకు ఆయన గెస్ట్‌గా అప్పుడప్పుడు వచ్చిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పేరుతో హడావుడి చేసి వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ఆయన నగరంలో లేకపోవడంతో కొందరు టీడీపీ నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించారు. అయితే ఆ నేతలు తమ సొంత వ్యక్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీ కోసం దశాబ్దాలపాటు కష్టపడిన వారిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. మరో వైపు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే కాంట్రాక్ట్‌ పనులు అప్పగిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయాలను నారాయణ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులో లేకపోవడంతో క్రియాశీల కార్యకర్తలు పార్టీ వ్యవహారాల్లో దూరంగా ఉంటున్నారు.

ఆ ఆరు గ్రూపులే కీలకం

మంత్రి నారాయణ నగర నియోజకవర్గంలో ఎక్కువ రోజులు గడపకపోవడంతో కొందరు టీడీపీ ముఖ్య నేతలకు పార్టీ కార్యక్రమాలు, ఇతర కాంట్రాక్ట్‌ కేటాయింపులను అప్పగించారు. అయితే మంత్రి నారాయణ భార్య రమాదేవి, వేమిరెడ్డి విజయ్‌భాస్కర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తాళ్లపాక అనురాధ, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఎవరికి వారు షాడో మంత్రులుగా వ్యవహరిస్తూ ఇసుక తవ్వకాలు, మద్యం వ్యాపా రులు, కాంట్రాక్ట్‌ పనులు, నామినేటెడ్‌ పదవులు, ఉద్యోగుల బదిలీలు ఇలా.. ప్రతి విషయంలో తమదైన ముద్ర వేసుకుంటున్నారు. పనులు అవసరమైన వారు సైతం వీరిలో ఎవరి దగ్గరకు పోతే.. తమ పని అవుతుందో తెలుసుకుని.. అక్కడికే వెళ్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కార్యకర్తలు సామాజిక వర్గాలు, స్థానిక బలాలతో ముడిపెట్టుకుని ఆయా నాయకుల చెంతకు చేరుతున్నారు. దీంతో తమ వారికి మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ పనులు అప్పగింత, నామినేటెడ్‌ పదవులు కేటాయింపు, ఇతర పనుల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నారు.

పోటాపోటీగా నారాయణ వద్దకు సిఫార్సులు

నగరంలోని టీడీపీ నేతల గ్రూపుల్లోని తమ వర్గీయులకు ప్రాధాన్యత కల్పించుకునేందుకు పోటీ పడుతున్నారు. నగరంలోని ఓ ఆలయ కమిటీ చైర్మన్‌ ఎన్నికలో తమ వ్యక్తికి స్థానం కల్పించాలని ఇద్దరు టీడీపీ ముఖ్య నేతలు మంత్రి వద్ద సిఫార్సులు పెట్టారు. ఇతర నామినేటెడ్‌ పదవులను తమ వారికే ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో ఎవరికి ఇవ్వాలనే దానిపై నారాయణ సమాలోచనలు చేసి పదవులు కేటాయించారు. ఈ క్రమంలో తాజాగా రంగనాథస్వామి బ్రహ్మోత్సవ కమిటీలో అన్యమతస్తురాలికి మంత్రి సిఫార్సులతో చోటు కల్పించడంతో అభాసుపాలయ్యారు.

గ్రూప్‌లుగా ఏర్పడిన నగర ముఖ్య టీడీపీ నేతలు

తమ కనుసన్నల్లోనే మద్యం వ్యాపారాలు, ఇసుక తవ్వకాలు, కాంట్రాక్ట్‌ పనుల కేటాయింపులు

నామినేటెడ్‌ పదవుల్లోనూ పోటా

పోటీగా మంత్రికి నేతల సిఫార్సులు

తాజాగా రంగనాథస్వామి బ్రహ్మోత్సవ కమిటీలో అన్యమతస్తురాలికి చోటు కల్పించి అభాసుపాలు

మరో వైపు నగరంలో టీడీపీ నేతలే ఇసుక తవ్వకాలు బహిరంగా చేస్తున్నారంటూ గతంలో మంత్రి నారాయణ నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో పేర్లతో సహా హెచ్చరించడంతో పెద్ద దుమారమే రేగింది. తాజాగా జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ తనకు చెడ్డ పేరు తెచ్చేలా కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని, నాకు అన్నీ తెలుసని చెప్పడంతో ఆ నేతలు ఎవరనేదానిపై పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తన దగ్గర 700 మంది పనిచేస్తున్నారని, ఎప్పటికప్పుడు నగరంలో ఏమి జరుగుతుందో తన దృష్టికి వస్తుందన్నారు. దీంతో ఆ నేతలపై నారాయణ నిఘా ఉంచారని స్పష్టమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement