భారం కాదు.. ప్రాణాలకు అభయం | - | Sakshi
Sakshi News home page

భారం కాదు.. ప్రాణాలకు అభయం

Feb 2 2026 7:15 AM | Updated on Feb 2 2026 7:15 AM

భారం కాదు.. ప్రాణాలకు అభయం

భారం కాదు.. ప్రాణాలకు అభయం

ఇటీవల
పోలీసుల సూచనలు

హెల్మెట్‌ ధరించకుండా

నిర్లక్ష్యంగా ప్రయాణం

రెండు నెలల్లో 13 మంది మృతి

జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు

● మర్రిపాడులో మోటార్‌బైక్‌పై వెళ్తున్న అంజిబాబు అనే వ్యక్తిని కారు వేగంగా ఢీకొనడంతో మృతిచెందాడు.

● కలిగిరిలోని పెద్ద చెరువు అలుగు సమీపంలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొనడంతో మోపెడ్‌పై వెళ్తున్న శంకరయ్య అక్కడికక్కడే చనిపోయాడు.

● గౌవరవరం సమీపంలో జాతీయ రహదారిపై కారు ఢీకొని బైక్‌పై వెళ్తున్న శ్రీనివాసులురెడ్డి అనే వ్యక్తి దుర్మరణం చెందాడు.

నెల్లూరు(క్రైమ్‌): రహదారి ప్రమాదాల్లో హెల్మెట్‌ ధరించకపోవడంతో తలకు బలమైన గాయాలై అనేకమంది మృతిచెందుతున్నారు. ద్విచక్ర వాహనచోదకునితోపాటు వెనుక కూర్చున్న వ్యక్తి విధిగా హెల్మెట్‌ ధరించాలని పోలీసు అధికారులు నిరంతరం అవగాహన కల్పిస్తున్నా కొందరిలో మార్పురావడం లేదు. హెల్మెట్‌ను శిరోభారంగా భావిస్తున్నారు. చిన్నపాటి పొరపాటే తమ ప్రాణాలనే తీయడమే కాకుండా ఎదుటివారిని సైతం ప్రమాదంలోకి నెట్టేస్తోందన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ఫలితంగా ప్రమాదాల్లో తమ వారిని కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. జిల్లాలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందుతున్న ద్విచక్ర వాహనదారుల్లో 90 శాతం మంది హెల్మెట్‌ లేకుండా ఉన్నవారే. రెండు నెలల వ్యవధిలో 13 మందికిపైగా ద్విచక్ర వాహనదారులు మృతిచెందినట్లు తెలుస్తోంది. గతేడాది హెల్మెట్‌ ధరించని 14,663 మందికి జరిమానాలు విధించారు. ఆ సంవత్సరంలో 902 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 514 మంది మృతిచెందగా 894 మంది క్షతగాత్రులయ్యారు.

తక్కువ ధరకు వచ్చేవి కొంటూ..

రూ.లక్షలు వెచ్చించి వాహనాలు కొనుగోలు చేస్తున్న వారు జీవితానికి అత్యంత భద్రత కల్పించే హెల్మెట్‌ విషయంలో అశ్రద్ధ చూపుతున్నారు. తక్కువ ధరకు వస్తున్నాయని రహదారుల వెంట దొరికే నాసిరకం హెల్మెట్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రమాద సమయంలో అవి వాహనచోదకులను రక్షించ లేకపోతున్నాయని పరిశీలనల్లో తేలింది. బీఐఎస్‌ (బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌) రూపొందించిన ఐఎస్‌ 4151 – 2015 మార్క్‌ కలిగిన హెల్మెట్‌ను పెట్టుకోవాలి. దాని బరువు 1,500 గ్రాముల కంటే తక్కువగా ఉండాలి. ఎక్కువైతే మెడపై ఒత్తిడి పడే అవకాశం ఉంది. రోజువారీ వినియోగానికి ఫుల్‌ ఫేస్‌, ఓపెన్‌ ఫేస్‌, మాడ్యులర్‌ హెల్మెట్లను వాడాలి. సరైన పరిణామం, వైజర్‌ స్పష్టంగా, బిగువైన చిన్‌ స్ట్రాప్‌ ఉండేలా చూసుకోవాలి. గాలిలోపలకి వెళ్లేలా రంధ్రాలుండాలి. ఒకసారి ప్రమాదానికి గురైన హెల్మెట్‌ను పక్కన పెట్టేయాలి. ప్రతి మూడేళ్లకోసారి కొత్తది తీసుకోవడం ఉత్తమం. హెల్మెట్‌ ధారణతో ప్రమాద సమయంలో తలకు రక్షణనిస్తుంది. గాలి, దుమ్ము, వర్షం, గాలిలోని పురుగుల నుంచి నుంచి కళ్లను, ముఖాన్ని కాపాడుతుంది.

హెల్మెట్‌ ధారణతో ప్రాణాలు భద్రం అనే నినాదంతో జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వాహనచోదకులకు మితిమీరిన వేగం, మద్యం మత్తులో వాహనాలు నడపరాదని సూచిస్తున్నారు. గమ్యానికి సకాలంలో చేరడం కన్నా క్షేమంగా చేరుకోవడం ముఖ్యమని, ఇంటి వద్ద కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారన్న విషయాన్ని మర్చిపోవద్దని తెలియజేస్తున్నారు. హెల్మెట్‌ భారం కాదని, భద్రత అని, చట్ట భయంతో కాకుండా కుటుంబ భవిష్యత్‌ కోసం ధరించాలని సూచిస్తున్నారు. నిబంధనలు విధిగా పాటించే వాహనదారులకు రోజా పువ్వులిచ్చి అభినందిస్తున్నారు. హెల్మెట్‌ ధరించని వారిపై రూ.1,000 అపరాధరుసుము విధిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement