ఇసుక దందా ఆగే వరకూ పోరాటం చేస్తా | - | Sakshi
Sakshi News home page

ఇసుక దందా ఆగే వరకూ పోరాటం చేస్తా

Jan 31 2026 10:22 AM | Updated on Jan 31 2026 10:22 AM

ఇసుక దందా ఆగే వరకూ పోరాటం చేస్తా

ఇసుక దందా ఆగే వరకూ పోరాటం చేస్తా

అక్రమ రవాణా జరుగుతుంటే

అధికారులేం చేస్తున్నారు

వైఎస్సార్‌సీపీ వెంకటగిరి

సమన్వయకర్త నేదురుమల్లి

కలువాయి(సైదాపురం): ‘అధికార పార్టీ నేతలు ధనదాహానికి సహజ వనరులు అడుగంటి పోతున్నాయి. ఇసుక అక్రమ దందా ఆగే వరకూ పోరాటం కొనసాగిస్తా’ అని వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కలువాయి, సైదాపురం, రాపూరు, బాలాయపల్లి, డక్కిలి, వెంకటగిరి మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నేతలతో కలిసి కలువాయి మండలంలోని తెలుగురాయపురంలో అక్రమ ఇసుక తవ్వకాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల అండతో పెన్నానదిలో భారీ యంత్రాలు ఏర్పాటు చేసి ఇసుకను తహసీల్దార్‌ కార్యాలయం మీదుగానే తరలించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ఈ ప్రాంతంలో తవ్వకాలు చేయకూడదని ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉన్నాయన్నారు. స్థానిక ప్రజాప్రతినిధికి తెలియకుండా ఇసుక దందా జరుగుతుందా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఇసుక ఫ్రీ అంటూ ప్రకటనలు చేస్తున్నారని, కానీ పేదలకు అందకపోవడంతోపాటు నేతలకు కల్పతరువుగా మారిందన్నారు. నదిలోకి రహదారిని ఏర్పాటు చేయడంతోపాటు యంత్రాలను అక్కడే ఉంచడం, ఇసుక రీచ్‌పై టీడీపీ జెండా రెపరెపలాడడం చూస్తుంటే అధికార పార్టీకి చెందిన నేతలు ఏ స్థాయిలో బరితెగించారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. పోలీసు, రెవెన్యూ వ్యవస్థలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ దందాపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలియజేశారు. మద్యం షాపులను ప్రైవేటీకరించడంతో ఏ గ్రామంలో చూసినా విచ్చలవిడిగా బెల్టు దందా జరుగుతున్నట్లు ఆరోపించారు. కార్యక్రమంలో కలువాయి జెడ్పీటీసీ సభ్యుడు అనిల్‌కుమార్‌రెడ్డి, కలువాయి, రాపూరు, సైదాపురం, డక్కిలి, బాలాయపల్లి, వెంకటగిరి వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు మాగినేని కృష్ణారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మన్నారపు రవికుమార్‌ యాదవ్‌, శ్రీనివాసులురెడ్డి, వెందోటి కార్తీక్‌రెడ్డి, పులి ప్రసాద్‌రెడ్డి, నేతలు నారాయణరెడ్డి, చిట్టేటి హరికృష్ణ, సేతరాసిబాలయ్య, విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement