పొగాకు ఉత్పత్తులపై విజిలెన్స్ దాడులు
నెల్లూరు(క్రైమ్): బిల్లుల్లేకుండా జరుగుతున్న పొగాకు ఉత్పత్తుల విక్రయాలు, గుట్కా తయారీ కేంద్రంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. రూ.40 లక్షల విలువైన సిగరెట్లు, పాన్‌మసాలాలు, గుట్కా తయారీ మెషీన్లు, గుట్కాలను సీజ్ చేశారు. కొంతకాలంగా కొందరు పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తూ ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లించకుండా వ్యాపారాలు చేస్తున్నారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు బృందాలుగా విడిపోయి నెల్లూరు సాలివీధిలోని శ్రీలక్ష్మి వెంకటశ్రీనివాస జనరల్ స్టోర్స్, శ్రీలక్ష్మి శ్రీనివాస ఎంటర్‌ప్రైజెస్, స్టోన్‌హౌస్‌పేటలోని ఎస్‌వీ ట్రేడర్స్‌లో తనిఖీలు చేశారు. బిల్లులు లేకుండా విక్రయిస్తున్న సిగరెట్లు, పాన్ మసాలాలను స్వాధీనం చేసుకున్నారు. మనుబోలు అపర్ణసాయి ట్రేడర్స్‌లో గుట్కా తయారీ మెషీన్‌ను సీజ్ చేసి, గుట్కాలు, పాన్‌మసాలాలను పట్టుకున్నారు. వ్యాపారులపై తదుపరి విచారణ అనంతరం ప్రభుత్వానికి జీఎస్టీ కట్టిస్తామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ సుభాని, డీసీటీఓ విష్ణురావు, సిబ్బంది పాల్గొన్నారు.


