అంతా ఇష్టారాజ్యం
ఉదయగిరి: స్థానిక అటవీ రేంజ్ పరిధిలో పెద్ద పులి సంచరిస్తోందనే వార్తలు ఇక్కడి వారిని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. దుర్గం ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో పెద్ద పులి కదలికలు నిక్షిప్తమయ్యాయి. దాదాపు 120 కిలోలకుపైగా బరువున్న మగ పెద్దపులి సంచరిస్తోందనే అంశాన్ని కొనుగొన్నారు. అయితే ఈ విషయమై వివరాలను అధికారులు నేటికీ వెల్లడించలేదు. కొర్సుకొండ, అన్నంపల్లి, కొత్తపల్లి, దుర్గంపల్లి, ఘాట్ రోడ్డులోని కనుమ బావి ప్రాంతాల్లో కదలికలను గుర్తించారు.
పల్లె వాసుల ఆందోళన
ఉదయగిరి అటవీ పరిధిలోని ఉదయగిరి – బండగానిపల్లి ఘాట్‌రోడ్డులో బిజ్జంపల్లికి ద్విచక్రవాహనంలో వెళ్తున్న ఇద్దరికి ఇది గత నెల 23వ తేదీ రాత్రి కనిపించింది. ఆ సమయంలో అధికారులు పరిశీలించి పాదముద్రలను గుర్తించి పులి సంచరిస్తోందనే అంశాన్ని తేల్చారు. మరోవైపు అదే నెల 31 వరకు పలు ప్రాంతాల్లో కదలికలపై అధికారులకు స్థానికులు తెలియజేశారు. అయినా వీరిలో కనీస స్పందన కొరవడిందనే విమర్శలున్నాయి. ఫలితంగా సమీప వ్యవసాయ పొలాల వద్దకు రాత్రి వెళ్లాలంటేనే స్థానికులు జంకే పరిస్థితి నెలకొంది.
వెళ్లిపోయిందంటూ ప్రచారం
ఇరవై రోజులుగా పులి జాడ లేకపోవడంతో ఇది వెళ్లిపోయిందంటూ అధికారులు ప్రచారం చేశారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా కొండకింద పల్లెలకు ఘాట్ రోడ్డులో ఆటో వెళ్తున్న వారికి ఇది సోమవారం రాత్రి కంటపడింది. ఇదే విషయమై వారు సమాచారమివ్వడంతో ఆ ప్రాంతాన్ని అధికారులు పరిశీలించి పాదముద్రల ద్వారా పెద్ద పులి అని తేల్చారు. ట్రాప్ కెమెరాను పరిశీలించగా, ఈ నెల 18వ తేదీ సాయంత్రం 6.37 గంటల సమయంలో దీన్ని చిత్రం నిక్షిప్తమైంది. అయితే ఇందులోనూ అధికారులు గోప్యత పాటించారు. మరోవైపు ఈ అటవీ ప్రాంతం చుట్టూ అతి సమీపంలో పల్లెలున్నాయి. వీటికి సంబంధించిన వ్యవసాయ భూములూ అడవి చుట్టే ఉన్నాయి. పశువులు, జీవాలను మేపేందుకు అడవిలోకి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో వీరి ప్రాణాలకు ముప్పున్న తరుణంలో అటవీ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఉదయగిరి ఫారెస్ట్ రేంజ్ అధికారి పర్యవేక్షణ లోపంతో కొంతమంది సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విధులకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. దీంతో ఎవరి వ్యాపకాల్లో వారుంటూ అటవీ రక్షణను గాలికొదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్లపడియ అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగల ఉదంతం.. పెద్దపులి సంచారం తదితర అంశాలను స్థానికులు గుర్తించేంత వరకు అటవీ అధికారులకు తెలియకపోవడం గమనార్హం.
ఉదయగిరి దుర్గంలో
పెద్ద పులి సంచారం
హడలిపోతున్న కొండకింద పల్లెలు
తూతూమంత్రంగా అటవీ సిబ్బంది చర్యలు
అంతా ఇష్టారాజ్యం


