మార్చురీలోనూ లంచాలకు పీక్కుతింటూ..
● ఎస్సైనూ వదలని వైనం
● రూ.30 వేలు డిమాండ్ చేసిన డాక్టర్
చచ్చిన శవాలను రాబంధులు పీక్కు తింటాయి. అచ్చం అలాగే ఉంది నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(పెద్దాస్పత్రి) మార్చురీ విభాగం తీరు. ప్రమాదంలో మరణించిన వారు, అనుమానాస్పద మరణాలకు సంబంధించిన శవాలను పోస్టుమార్టం
చేయాలంటే సంబంధిత ఫోరెన్సిక్ డాక్టర్లకు రూ.వేలకు వేలు లంచాలు సమర్పించుకోవాల్సిందే. లేదంటే పోస్టుమార్టం సకాలంలో చేయకుండా బాధిత కుటుంబాలను ఏడిపిస్తున్నారు. తమ ఆప్తులను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ పెద్దాస్పత్రిలోని మార్చురీ విభాగంలో లంచాల కోసం
కొందరు పీక్కుతింటున్నారు.
ఆ డాక్టర్ మాత్రమే వద్దంటున్నాడు
కోవూరుకు చెందిన ఓ డాక్టర్ కూడా ఫోరెన్సిక్ విభాగంలో (మార్చురీ)లో పని చేస్తున్నాడు. ఆయన తన డ్యూటీలో ముందుగానే బాధితుల వద్దకు వచ్చి ఎవరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వవద్దని చెబుతాడు. ఎవరైనా లంచం ఇచ్చినట్టు తెలిస్తే వారికి రిపోర్టు కూడా ఇవ్వనని చెప్పి ఆ తర్వాతనే పోస్టుమార్టం చేస్తాడు. ఆ ఒక్క డాక్టర్ డ్యూటీ చేసినప్పుడు సిబ్బంది కూడా భయంగా ఉంటున్నారు. మిగతా సందర్భాల్లో డాక్టర్లు, సిబ్బంది పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి.
నెల్లూరు(అర్బన్): కొత్తవంగల్లు గ్రామంలో ఇద్దరు వృద్ధ దంపతులు నివసిస్తుండే వారు. అందులో సుశీలమ్మ సుమారు మూడేళ్ల క్రితం మరణించింది. బంధువులు అంత్యక్రియలు కూడా జరిపారు. ఇదిలా ఉండగా మరో కేసులో ఓ మహిళను చంపి జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీని కొడవలూరు ఎస్సై కోటిరెడ్డి విచారణ చేశారు. ఈ క్రమంలో ఆ ఖైదీ కొత్త వంగల్లుకు చెందిన సుశీలను కూడా తాను చంపినట్టు తెలిపాడు. దీంతో ఎస్సై సుశీల కేసును రీఎగ్జామిన్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో చట్టబద్ధంగా లెటర్ తీసుకుని గురువారం నెల్లూరులోని పెద్దాస్పత్రి మార్చురీ వద్దకు వచ్చాడు. గతంలో పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీసి రీఎగ్జామినేషన్ నిర్వహించాల్సి ఉందని మార్చురీలో ఉండే డాక్టర్లకు తెలిపాడు. దీంతో డాక్టర్లు రూ.30 వేలు ఇస్తే ఇప్పుడే వస్తామన్నారు. అందులో రూ.15 వేలను తమ డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడీకి ఇవ్వాలని చెప్పారు. దీంతో ఎస్సై మాట్లాడుతూ వృద్ధురాలికి సంబంధించిన కుటుంబం నిరుపేదలని, వారు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని, తన జేబులో నుంచి రూ.10 వేలు ఇస్తానని చెప్పాడు. దీనికి అంగీకరించకపోతే రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. అయితే రీఎగ్జామినేషన్‌కు సంబంధించి లెటర్‌ను ఇస్తే తీసుకోలేదు. దీంతో ఆయన పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవిని కలిసి తనను లంచం అడిగిన తీరు వివరించి లెటర్ తీసుకోవాలని కోరాడు. అయితే డాక్టర్ మాధవి లెటర్‌ను నిబంధనల మేరకు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌కు ఇవ్వాలని సూచించారు. దీంతో ఆయన మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌కు అందజేశారు. ఇదే సందర్భంలో ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ అధికారిగా కొనసాగుతున్న డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డిని కలిసి తమను లంచం డిమాండ్ చేస్తున్న వైనాన్ని ఎస్సై వివరించారు. అయితే డిప్యూటీ కలెక్టర్ పద్ధతి ప్రకారం డాక్టర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సి ఉంది. అయితే కింది స్థాయిలోని ఓ అవుట్ సోర్సింగ్ కార్మికుడు మనోజ్‌ను పిలిచి డాక్టర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించాడు. బేరం కుదరకపోవడంతో తమ శాఖ హెచ్‌ఓడీ లేడని శుక్రవారం రావాలని డాక్టర్లు ఎస్సైకు తెలిపారు.
నగరంలోని ప్రభుత్వ పెద్దాస్పత్రి
మరికొన్ని ఉదాహరణలు..
ఒక కార్పొరేట్ ఆస్పత్రికి ఎండీగా పనిచేసిన (ఇప్పుడు లేదు) వ్యక్తి బంధువుల పోస్టుమార్టానికి గత సంవత్సరంలో రూ.20 వేలు ఇచ్చాడని తెలుస్తోంది. ఈ విషయం హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీకి తెలిసి సదరు డాక్టర్‌ను నిలదీశారు. అయితే డబ్బులు ఇచ్చిన వ్యక్తి దీని గురించి వదిలేయండి.. అని చెప్పడంతో ఆగిపోయారు.
కోవిడ్ సమయంలో ఎంఎన్‌ఓగా పనిచేసిన ఓ వ్యక్తి పీడించి, పీడించి డాక్టర్లకు ఇవ్వాలంటూ డబ్బులు వసూలు చేశాడు. తర్వాత కాలంలో ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు హెచ్‌డీఎస్ కమిటీ వారి సిఫార్సుతో ఉద్యోగంలో చేర్చుకున్నారు.
ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పటికై నా కలెక్టర్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని బాధితులు కోరుతున్నారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు
రీ ఎగ్జామినేషన్ కోసం డాక్టర్లు డబ్బులు డిమాండ్ చేశారని కొడవలూరు ఎస్సై ఓరల్‌గా చెప్పారు. అయితే ఎవరైనా ఆధారాలతో రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. డబ్బులు వసూలు చేయకుండా చేస్తాం. – డాక్టర్ కె.మాధవి,
పెద్దాస్పత్రి సూపరింటెండెంట్
రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు డిమాండ్
పెద్దాస్పత్రి మార్చురీ విభాగంలో సందర్భాన్ని బట్టి పోస్టుమార్టం నిర్వహించాలంటే రూ.50 వేల వరకు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా అక్కడ ఒక ప్రైవేటు ఫొటోగ్రాఫర్ తిష్ట వేశాడు. ఆయన డాక్టర్లకు పోలీసులకు మధ్య రాయబారిగా ఉంటూ దండకాలు సాగిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఏ దిక్కులేని నిరుపేదలకు చెందిన వారైతే కనీసం రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆప్తులను పోగొట్టుకుని రోదనలు మిన్నంటుతున్నా డబ్బులు కోసం పీడిస్తున్నారని బాధితులు పేర్కొంటున్నారు. అనాథ శవాలకు పోస్టుమార్టం చేయాలంటే పోలీసులే తమ జేబుల నుంచి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. ఇదంతా ఫోరెన్సిక్ విభాగం హెచ్‌ఓడీ ఆధ్వర్యంలో జరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మార్చురీలోనూ లంచాలకు పీక్కుతింటూ..
మార్చురీలోనూ లంచాలకు పీక్కుతింటూ..


