డెల్టా ప్రాంతానికి జల కల్పతరువు కనిగిరి రిజర్వాయర్. పన
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కనిగిరి జలాశయం డెల్టా సాగునీటి మౌలిక సదుపాయం మాత్రమే కాదు.. రైతుల జీవనాడి. వ్యవసాయం, తాగునీటికి జలనిధి. ప్రాజెక్ట్ నిర్వహణలో నెలకొన్న తీవ్రమైన నిర్లక్ష్యం ఫలితంగా శిథిల స్థితికి చేరింది. ప్రాజెక్ట్ దెబ్బతింటే.. భవిష్యత్‌లో ఆయకట్టు రైతులకు, తాగునీటి సరఫరాకు పెను ప్రమాదం పొంచి ఉంది. కట్టల బలహీనపడడంతో పాటు పూడిక పేరుకుపోవడం, ఎప్పటికప్పుడు మరమ్మతులు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రిజర్వాయర్ సామర్థ్యం తగ్గిపోయి ప్రమాదకరంగా మారుతోంది.
1.5 లక్షల ఎకరాలకు సాగునీటి వనరు
బ్రిటిష్ కాలంలో 1890–1898 మధ్య కనిగిరి రిజర్వాయర్‌ను నిర్మించారు. ఒకప్పుడు పెన్నార్ డెల్టాకు జీవనాడిగా ఉండేది. సంగం ఆనకట్ట నుంచి ఐదు ప్రధాన కాలువల ద్వారా నీటిని మళ్లించి సంగం, బుచ్చిరెడ్డిపాళెం, దగదర్తి, కోవూరు, కొడవలూరు మండలాల్లోని రైతులకు 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. ఇలాంటి ప్రాధాన్యత, చరిత్ర కలిగిన రిజర్వాయర్ ప్రస్తుతం నిర్లక్ష్యపు కోరల్లో చిక్కుకొని శల్యమవుతోంది. ప్రధానంగా ప్రాజెక్ట్‌లోని రెగ్యులేటర్ గేట్లు తుప్పు పట్టి దెబ్బతిన్నాయి. తరచూ మరమ్మతులకు గురవుతూ మొరాయిస్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రక్షణ కట్టల పటిష్టత అవసరం
దశాబ్దాల క్రితం నిర్మించిన రిజర్వాయర్ నిర్వహణలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్ల వర్షాలకు, వరదలకు కట్టలు బలహీన పడ్డాయి. కట్టలపై కర్రతుమ్మ చెట్లు ప్రబలిపోవడంతో పటిష్టత లోపిస్తోంది. దీనికి తోడు రిజర్వాయర్ చుట్టూ కొందరు నిబంధనలకు విరుద్ధంగా చేపల గుంతలు సాగు చేస్తున్నారు. దీంతో కట్ట పటిష్టత దెబ్బతింటున్నా.. గుంతలను తొలగించే ప్రయత్నం అధికారులు చేయడం లేదు. చేపల గుంతలను తొలగించి, కట్టలపై పెరిగిన కర్రతుమ్మ చెట్లను తొలగించి, కట్టలను ఎత్తు పెంచడంతోపాటు రివిట్‌మెంట్ కూడా చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. దక్షిణ, తూర్పు పైడేరు కాలువలపై దెబ్బతిన్న రెగ్యులేటర్లను పునర్నిర్మించాలి.
పూర్తి సామర్థ్యం మేరకు నీరు లేదు
రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 3.5 టీఎంసీలు కాగా, దశాబ్దాల కాలం నుంచి పూడిక తీయకపోవడంతో రిజర్వాయర్‌లో భారీగా బురద, చెత్త పేరుకుపోయింది. దీంతో ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం సగానికి తగ్గిపోయింది. ఈ బురదనంతా తొలగిస్తే నీటి సామర్థ్యం మరింత పెరగడంతోపాటు వ్యవసాయానికి సమృద్ధిగా నీటి వసతి పెరిగే అవకాశం ఉంది. ఆయకట్టును పెంచేందుకు అవ కాశం కలుగుతుందని రైతులు అభిప్రాయపడుతున్నా రు. ఈ పనులతోపాటు విద్యుత్ ఆధారిత రేడియల్ గేట్లు ఏర్పాటు చేస్తే జలాశయంలో పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ ఉంచేందుకు వీలుంటుంది.
రూ.45 కోట్లతో ప్రతిపాదనలు.. బుట్టదాఖలు
ఆర్నెళ్ల్ల క్రితం పెన్నా డెల్టా కమిటీ శిథిలమవుతున్న జలాశయం కట్టలను బలోపేతం చేయడానికి రూ.45 కోట్లు మంజూరు చేయాలని నీటి పారుదల అధికారులు ప్రతిపాదనలు పంపినా సర్కారు బుట్టదాఖలు చేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెనుబల్లి, కాగులపాడు మధ్య సదరన్ కాలువకు గండి పడి వందల ఎకరాల్లో నారుమడులు నీటమునిగాయి. అయినా కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు విన్నవించినా ప్రయోజనం శూన్యం.
125 ఏళ్ల నాటి కనిగిరి జలాశయం శిథిలం
ప్రాజెక్ట్ కట్టల నుంచి
కాలువ కట్టల వరకు బలహీనం
రూ.45 కోట్లతో చేసిన
ప్రతిపాదనలు.. బుట్టదాఖలు
ఇటీవల భారీ వర్షాలకు దక్షిణ కాలువకు మూడు చోట్ల గండ్లు
1.5 లక్షల ఎకరాలకు
సాగునీరు అందించే ప్రాజెక్ట్
దెబ్బతిన్న గేట్లు, కోతకు గురైన కట్టలు
3.5 టీఎంసీల సామర్థ్యం గల జలాశయం
పూడికతో నిండిపోవడంతో
తగ్గిన నీటి నిల్వ సామర్థ్యం
రైతులకు ప్రాణాధారం
కనిగిరి రిజర్వాయర్ పెన్నాడెల్టా ప్రాంత రైతులకు ప్రాణాధారం. వ్యవసాయానికి, తాగునీరు, భూగర్భజల మట్టాలు పెరడానికి ముఖ్య అవసరం. జలాశయం దెబ్బతింటే వేలమంది రైతులు జీవనాధారం కోల్పోతారు. – కే శ్రీనివాసులురెడ్డి,
బుచ్చిరెడ్డిపాళెం పట్టణ రైతు విభాగ అధ్యక్షుడు
పటిష్టతకు చర్యలు చేపట్టాలి
కనిగిరి రిజర్వాయర్ పటిష్టతకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇటీవల కురిసిన వర్షాలకు పలుచోట్ల కాలువలకు గండ్లు పడ్డాయి. వందల ఎకరాల్లో నారుమడులు దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఈ విషయమై దృష్టి సారించి నిధులు మంజూరు చేయించి పనులు మొదలుపెట్టాలి.
– బీ నారాయణ,రైతు, బుచ్చిరెడ్డిపాళెం
డెల్టా ప్రాంతానికి జల కల్పతరువు కనిగిరి రిజర్వాయర్. పన
డెల్టా ప్రాంతానికి జల కల్పతరువు కనిగిరి రిజర్వాయర్. పన


