పంచాయతీల అభివృద్ధిపై దృష్టి సారించాలి
వింజమూరు(ఉదయగిరి): జిల్లాలో పంచాయతీల అభివృద్ధిపై కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని డీపీఓ వసుమతి పేర్కొన్నారు. వరికుంటపాడు, వింజమూరు, దుత్తలూరు, కొండాపురం, కలిగిరి మండలాల పంచాయతీ కార్యదర్శులతో స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో మెరుగైన పారిశుధ్యం కోసం ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. జెడ్పీటీసీ గణపం బాలకృష్ణారెడ్డి, డీఎల్పీఓ వెంకటరమణ, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ రామారావు తదితరులు పాల్గొన్నారు.
కాటేపల్లి పంచాయతీలో డీఎల్పీఓ విచారణ
వింజమూరు(ఉదయగిరి): మండలంలోని కాటేపల్లిలో పంచాయతీ నిధుల దుర్వినియోగంలో సర్పంచ్ విజయలక్ష్మమ్మపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విచారణను కావలి డీఎల్పీఓ వెంకటరమణ గురువారం జరిపారు. ఫిర్యాదు చేసిన మధు, సర్పంచ్‌ను ఒక వేదికపై కూర్చోబెట్టి మాట్లాడారు. ఈ సందర్భంగా వీరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. వీరికి సర్దిచెప్పి సమన్వయంతో పనులు చేసుకోవాలని సూచించారు. పంచాయతీలో రూ.29 లక్షల నిధులున్నాయని, వీటిని ఉపయోగించి గ్రామంలో అభివృద్ధి పనులు చేయాలన్నారు. సర్పంచ్‌పై పలు ఆరోపణలు ఉండటంతో చెక్‌పవర్‌ను రద్దు చేశారని, డిప్యూటీ ఎంపీడీఓ రామారావుకు డ్రాయింగ్ పవర్ ఉందన్నారు. పంచాయతీ కార్యదర్శి నరసింహారెడ్డి, బండి కృష్ణారెడ్డి, జిలానీ, రామయ్య తదితరులు పాల్గొన్నారు.
షట్టర్ల పనితీరుపై ఆరా
సంగం: సంగంలోని పెన్నానదిని ఇరిగేషన్ ఎస్‌ఈ దేశ్‌నాయక్ గురువారం పరిశీలించారు. షట్టర్లను పరిశీలించి.. వాటి పనితీరుపై డీఈ, ఏఈని ఆరాతీసిన అనంతరం ఆయన మాట్లాడారు. మోంథా, దిత్వా తుఫాన్లతో సాగునీటి వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. డెల్టా వ్యవస్థ, కనుపూరు కాలువలు పూడిపోవడమే కాకుండా, పలు చోట్ల షట్టర్లు, ఇతర నిర్మాణాలు దెబ్బతిన్నాయని వివరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కొన్ని పనులను ప్రారంభించామని వెల్లడించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తుఫాన్ నష్టాలపై జేఈ, డీఈ , ఈఈ స్థాయి అధికారులతో క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వేను నిర్వహించి.. రానున్న రోజుల్లో వీటిని తట్టుకునేలా షట్టర్లు, నిర్మాణాలను బలోపేతం చేసేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. తుఫాన్లతో సంభవించిన నష్టాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి, నిధుల మంజూరు కోసం కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపేలా చర్యలు చేపడుతున్నామన్నారు. డీఈ పెంచలయ్య, ఏఈ వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పల్స్‌పోలియో ప్రచార మెటీరియళ్ల పంపిణీ
నెల్లూరు(అర్బన్): జిల్లాలో ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన ప్రచార మెటీరియళ్లను పీహెచ్‌సీలకు డీఎంహెచ్‌ఓ సుజాత ఆధ్వర్యంలో గురువారం పంపిణీ చేశారు. వీటిని ఆయా పీహెచ్‌సీల డాక్టర్లు.. ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలకు అందజేయనున్నారు. పోలియో బూత్‌ల వద్ద బ్యానర్లను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేయనున్నారు.
పంచాయతీల అభివృద్ధిపై దృష్టి సారించాలి
పంచాయతీల అభివృద్ధిపై దృష్టి సారించాలి
పంచాయతీల అభివృద్ధిపై దృష్టి సారించాలి


