మేయర్ రాజీనామాకు కౌన్సిల్ ఆమోదం
● సర్వసభ్య అత్యవసర సమావేశం
● హాజరైన 38 మంది కార్పొరేటర్లు
నెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థ కార్యాలయంలోని అబ్దుల్ కలామ్ సమావేశ మందిరంలో కౌన్సిల్ అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని గురువారం నిర్వహించారు. దీనికి సంబంధించి కార్పొరేషన్ కార్యాలయానికి అన్ని వైపులా అధిక సంఖ్యలో పోలీసులను మోహరించారు. అందర్నీ తనిఖీ చేసి వివరాలను అడిగాకే లోపలికి పంపారు. ఇన్‌చార్జి మేయర్ రూప్‌కుమార్‌యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఎక్స్‌అఫీషియో సభ్యుడు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హాజరయ్యారు. గోవా టూర్ వెళ్లిన కార్పొరేటర్లు ప్రత్యేక వాహనంలో చేరుకున్నారు. సమావేశంలో మేయర్ స్రవంతి రాజీనామాను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. కొత్త మేయర్‌ను ఎన్నుకునేంత వరకు ఇన్‌చార్జి మేయర్‌గా రూప్‌కుమార్‌యాదవ్ వ్యవహరించనున్నారు. కొత్త మేయర్ ఎన్నిక చట్ట ప్రకారం జరుగుతుందని, అప్పటి వరకు తాత్కాలిక మేయర్‌గా తానుంటానని చెప్పారు. ఆయనకు పలువురు అభినందనలను తెలియజేశారు. సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. కమిషనర్ నందన్, సెక్రటరీ శ్రీలక్ష్మి, డిప్యూటీ డైరెక్టర్ మాధురి, ఎంహెచ్‌ఓ కనకాద్రి తదితరులు పాల్గొన్నారు.


